కేరళలోని కోజికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదం ఇప్పటి వరకు 19 మందిని పొట్టన పెట్టుకుంది. శుక్రవారం ఐఎక్స్ 1355 ఎయిర్ ఇండియా విమానం ఇక్కడి టేబుల్ టాప్ రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో అదుపు తప్పటంతో ఈ దుర్ఘటన సంభవించింది. వందేభారత్ మిషన్‌లో భాగంగా దుబాయి నుంచి భారత్‌కు వచ్చిన ప్రవాస భారతీయులు.. మరికొద్ది సేపట్లో తమ స్వస్థలాలకు చేరుతారనగా జరిగిన ఈ దుర్ఘటన దేశం మొత్తాన్ని కలవరపరచింది. కాగా, అంతవరకు సాఫీగా సాగిన ప్రయాణం చివరిలో ఏమైందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదం జరిగిన తొలి ఐదు నిమిషాల్లో ఏం జరిగిందనే అంశానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...
- రాత్రి 7:40 గంటలు:భారీ వర్షం కురుస్తుండటం వల్ల ఎయిరిండియా బోయింగ్ విమానం, టేబుల్ టాప్ రన్‌వేపై అదుపుతప్పి 35 అడుగుల లోయలోకి పడిపోయింది. దీనిని గమనించిన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఒకరు ఈ సమాచారాన్ని వెంటనే అధికారులకు అందించారు.
- రాత్రి 7:41 గంటలు:సీఐఎస్‌ఎఫ్ కంట్రోల్ రూం నుంచి సీఐఎస్‌ఎఫ్ క్విక్ రెస్పాన్స్ టీంకు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందింది.
- రాత్రి 7:42 గంటలు:విమానాశ్రయ అగ్నిమాపక దళానికి సమాచారం అందటంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.
- రాత్రి 7:43 గంటలు:సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఘటనను గురించి విమానాశ్రయ వైద్య విభాగానికి సమాచారమిచ్చారు.
- రాత్రి 7:44 గంటలు:సీఐఎస్‌ఎఫ్ కంట్రోల్ రూం అధికారులు విమానాశ్రయ డైరెక్టర్, టెర్మినల్ అధికారితో సంప్రదింపులు జరిపారు.
- రాత్రి 7:45 గంటలు:సీఐఎస్‌ఎఫ్ కంట్రోల్ రూం నుంచి స్థానిక పోలీసులకు సమాచారం చేరింది.
ఈలోగా కొంతమంది స్థానికులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. విమాన ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటంతో.. స్థానికులు సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకుకేందుకు విమానాశ్రయ ఉన్నతాధికారులు అనుమతినిచ్చారు. సమయానుగుణమైన ఈ నిర్ణయం, అధిక నష్టం సంభవించకుండా దోహదపడింది.