దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అండర్-గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశానికి 2021-22 నుంచి ప్రత్యేక పరీక్ష (కామన్ ఆప్టిట్యూడ్ టెస్ట్)ను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం సహా 54 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఇంతవరకు 12వ తరగతిలో కటాఫ్ మార్కుల విధానంతో ప్రవేశాలు కల్పించేవారు. ఇందులో ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈమేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఇకపై ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది.
కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఇక ప్రవేశాలు సులువు - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు సులువు కానున్నాయి. ఇప్పటివరకూ అమలు చేస్తూ వచ్చిన ఇంటర్ మార్కుల కటాఫ్ విధానంలో ఉన్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం.. కామన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (క్యాట్) ద్వారా ప్రవేశాలు కల్పించనుంది.
ఇందులో వెర్బల్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ వంటివి ఉంటాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. సబ్జెక్టుల వారీగా ప్రశ్నలతో ప్రత్యేక సెక్షన్ ఉంటుందని వివరించారు. ఈ ప్రవేశపరీక్షకు సంబంధించిన విధివిధానాలను రూపొందించేందుకు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ ఉప కులపతి ఆర్.పి.తివారీ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని కేంద్ర విద్యా శాఖ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2021 జనవరి ఆఖరు నాటికి తన సిఫార్సులను అందజేస్తుంది.
ఇదీ చదవండి:గిఫ్ట్‌ల ఎర చూపి... ఆస్తులమ్ముకునేలా చేస్తారు...!