తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ గెలిస్తే కాంగ్రెస్​దే బాధ్యత: కేజ్రీవాల్

సార్వత్రిక ఎన్నికల్లో భాజపాయేతర పార్టీలకు కాంగ్రెస్​ హాని తలపెడుతోందని ఆరోపించారు ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్. మోదీ అధికారంలోకి తిరిగొస్తే పూర్తి బాధ్యత రాహుల్​దేనని పీటీఐ ముఖాముఖిలో అన్నారు.

మోదీ గెలిస్తే కాంగ్రెస్​దే బాధ్యత

By

Published : May 10, 2019, 3:47 PM IST

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్ర ఆరోపణలు చేశారు ఆప్ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. విపక్షాలకు హాని తలపెడుతున్నారని విమర్శించారు. మోదీ తిరిగి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత వహించాలని పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో హెచ్చరించారు.

"యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమికి, కేరళలో వామపక్ష​ కూటమికి, బంగాల్​లో తృణమూల్​ కాంగ్రెస్​కు, ఆంధ్రప్రదేశ్​లో తెలుగుదేశానికి, దిల్లీలో ఆమ్​ఆద్మీ పార్టీకి కాంగ్రెస్​ హాని తలపెడుతోంది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ విపక్షాలతో పోటీచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ వ్యవహారశైలి చూస్తే భాజపాపై పోటీచేస్తున్నట్లుగా లేదు. కాంగ్రెస్ విపక్షాలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తోంది."
-అరవింద్​ కేజ్రీవాల్, ఆప్ అధినేత

దిల్లీలో మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయమయ్యాయి.

మోదీపైనా...

మోదీపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు కేజ్రీవాల్. కీలక రంగాల్లో అబివృద్ధి విషయంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని, అందుకే "నకిలీ జాతీయవాదం" అంశాన్ని తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు.

"మోదీ జాతీయవాదం నకిలీది. అది దేశానికి ప్రమాదకరం. మోదీ ఐదేళ్లలో ఏం చేశారనేది చెప్పలేకనే ఓట్లకోసం సైనిక బలగాలను వాడుకుంటున్నారు."
-అరవింద్ కేజ్రీవాల్, ఆప్ అధినేత

మోదీకన్నా ఆయన నయం...

మోదీకంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పనితీరు భేష్ అన్నారు కేజ్రీవాల్. భాజపా తిరిగి అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.

"మా ఏకైక లక్ష్యం మోదీ, షాలను తిరిగి అధికారంలోకి రాకుండా చూడటం. వాళ్లిద్దరూ కాకుండా ఎవరికైనా మేం మద్దతిస్తాం."
-అరవింద్ కేజ్రీవాల్, ఆప్ అధినేత

దిల్లీలో పరిస్థితి ఆశాజనకంగా ఉందన్నారు కేజ్రీవాల్. నెలరోజుల క్రితం భీకర పోరు తప్పదనుకున్నా... గత 10 రోజులుగా పరిస్థితి నాటకీయంగా మారిపోయిందని చెప్పారు. 2017లో 67 స్థానాలు పొందినట్లుగానే ఈసారి మొత్తం 7 లోక్​సభ సీట్లు ఆప్​ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేజ్రీవాల్.

ABOUT THE AUTHOR

...view details