కశ్మీర్లో ఆంక్షల సడలింపు.. అప్రమత్తంగా బలగాలు జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370, 35ఏల రద్దు నేపథ్యంలో విధించిన ఆంక్షలను కాస్త సడలించారు అధికారులు. శుక్రవారం స్థానిక మసీదుల్లో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున నిరసనలకు దారి తీసే అవకాశం ఉందని భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. అన్ని ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఏ ఒక్క కశ్మీరీ వేధింపులకు గురికాకూడదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అధికారులకు సూచించారు. ఇప్పటికే శ్రీనగర్, దాల్ లేక్ ప్రాంతాల్లో ఆంక్షలు సడలించి ప్రజలను రోడ్లపైకి అనుమతించారు.
"శుక్రవారం స్థానిక మసీదుల వద్ద జనాలు సమావేశమయ్యే సందర్భంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగే అవకాశం ఉంది. దానికి తగ్గట్లుగానే అవసరమైన చర్యలు తీసుకున్నాం."
-భద్రతా అధికారి
ప్రజల అవసరాలు తీర్చాలి
జమ్ముకశ్మీర్ ప్రజలు రేషన్, ఔషధాలు వంటి నిత్యవసరాలను తీసుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు గవర్నర్ సత్యపాల్ మాలిక్. ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రతి రోజు కనీసం 20 కుటుంబాలను కలిసి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రజల అవసరాలు తీర్చేందుకు ప్రత్యేక వ్యాన్లు ఏర్పాటు చేయాలన్నారు.
జమ్ముకశ్మీర్ వెలుపల ఉన్న వారి పిల్లలతో మాట్లాడేందుకు ప్రత్యేక టెలిఫోన్ సౌకర్యం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆదేశించారు. ఈ మేరకు శ్రీనగర్‌లో 9419028242, 9419028251 హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు అధికారులు.
శ్రీనగర్‌లో లెఫ్ట్ నాయకులు అడ్డగింత...
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాను శ్రీనగర్ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారిని తిరిగి దిల్లీకి పంపించేశారు.
ఇదీ చూడండి: పోక్సో చట్టం కింద ఉన్నావ్ నిందితుడు బుక్