ఆధ్యాత్మిక కర్తార్‌పుర్ నడవా రేపే ప్రారంభం సిక్కు మత వ్యవస్థాపకులు గురునానక్.. తన చివరి 18 ఏళ్లను గడిపిన కర్తార్‌పుర్‌ను దర్శించుకోవాలన్న భారతీయ భక్తుల అడ్డంకులు రేపటితో తొలగిపోనున్నాయి. పాక్‌లోని పంజాబ్ రాష్ట్రం.. నరోవాల్ జిల్లాలో ఉన్న దర్బార్ సాహిబ్‌ను.. భారత్‌లోని పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్‌పుర్ జిల్లాలో ఉన్న డేరా బాబా నానక్ ఆలయాన్ని కలిపే కర్తార్‌పుర్ ఆధ్యాత్మిక నడవా రేపు ప్రారంభం కానుంది.
క్రీ.శ.1522 సంవత్సరంలో కర్తార్‌పుర్ వద్ద సాహిబ్ గురుద్వారాను నెలకొల్పారు గురునానక్ దేవ్. అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పవిత్ర స్థలాన్ని దర్శించుకోవడానికి భారత్‌లోని సిక్కు మతస్థులు దశాబ్దాలుగా ఎదురుచూశారు. చివరికి వారి నిరీక్షణ ఫలించి.. నడవా నిర్మాణానికి భారత్-పాకిస్థాన్‌లు అంగీకారం తెలిపాయి. అక్టోబర్ 24న కారిడార్ నిర్వహణ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ నడవా.. భక్తులకు వీసా రహిత ప్రయాణాన్ని కల్పిస్తుంది. ఈ మేరకు భారత్ వైపు నడవాను ప్రధాని మోదీ... పాక్ వైపు కారిడార్‌ను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించనున్నారు.
ముఖ్యనేతలతో మొదటి బృందం..
కర్తార్‌పుర్ ను దర్శించుకునేందుకు 550 మందితో కూడిన భారత ప్రతినిధి బృందం జాబితాను కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌కు పంపింది. ఈ జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, కేంద్రమంత్రులు హర్‌దీప్ సింగ్ పురి, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్‌తో పాటు కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా, దీపేందర్ సింగ్ హుడా, జితిన్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
సన్నాహాలు పూర్తి...
కారిడార్ ప్రారంభోత్సవానికి ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ గురుదాస్‌పూర్, కపుర్తలా, అమృత్‌సర్ జిల్లాలకు సెలవు ప్రకటించారు. సందర్శకుల భద్రతకు పాక్ గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 100 మందితో కూడిన పర్యటక పోలీసు దళాన్ని మోహరించింది. ఈ సంఖ్యను మరింత పెంచుతామని వెల్లడించింది పాక్ పోలీసు విభాగం. కర్తార్‌పుర్‌లో గురుద్వారా మినహా మరే ప్రాంతానికి వెళ్లకూడదని పాక్ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.
సమస్యలు తలెత్తినా..
కర్తార్‌పుర్ ఆధ్యాత్మిక నడవా నిర్మాణం నుంచే అనేక సమస్యలు తలెత్తాయి. అయితే, భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, కశ్మీర్ అంశం ఈ కారిడార్ నిర్మాణానికి అడ్డు రాలేదు. 1999లో ఇరుదేశాల మధ్య మొదటిసారి ప్రతిపాదనకు వచ్చిన ఈ ఆధ్యాత్మిక నడవా ఎన్నో చర్చల తర్వాత పట్టాలకెక్కింది. రోజుకు 5 వేల మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారని సమాచారం. అయితే కర్తార్‌పుర్‌ను దర్శించుకునే భక్తులకు పాక్ కొన్ని షరతులు విధించింది.
పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు 20 డాలర్లు చెల్లించాలని నిర్ణయించింది. ఇందుకు భారత్ తీవ్రంగా అభ్యంతరం తెలిపినా.. దాయాది దేశం వెనక్కి తగ్గలేదు. ప్రారంభ రోజు సహా గురునానక్ జయంతి అయిన నవంబర్ 12న రుసుమును వసూలు చేయబోమని మొదట ప్రకటించింది. అనంతరం ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గి ఆ రెండు రోజులు కూడా చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. పాస్‌పోర్టు కలిగి ఉండాలన్న అంశంపైనా పాక్ స్పష్టతనివ్వలేదు.
పాక్‌కు ఆర్థిక చేయూత
యాత్రికుల నుంచి 20 డాలర్లు వసూలు చేయాలన్న నిర్ణయంతో కష్టాల్లో ఉన్న పాక్ ఖజానాకు నిధులు సమకూరనున్నాయి. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్... అధికారంలోకి రాకముందు గత ప్రధానులు దేశ పర్యటక రంగాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలోనే దాయాది దేశం కారిడార్‌కు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. అందుకే ద్వైపాక్షికంగా భారత్‌తో ఎన్ని సమస్యలున్నా కారిడార్ నిర్మాణానికి పాక్ కట్టుబడి ఉంది.
యాత్రికుల నుంచి వసూలు చేసే మొత్తంతో పాక్.. భారత కరెన్సీలో 258 కోట్ల రూపాయలు ఆర్జించనుంది. ఇది పాక్ కరెన్సీలో 571 కోట్ల రూపాయలకు సమానం. కర్తార్‌పూర్ కారిడార్ వల్ల... పాక్‌లో మత పరమైన పర్యటకానికి అవకాశాలు కూడా తెరుచుకుంటాయని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. కేవలం సిక్కులకే కాకుండా.. దేశంలో ఉన్న పలు ఇతర మతాల దర్శనీయ స్థలాలను సందర్శించుకునేందుకు ఆయా మతస్థులు ఆసక్తి చూపిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది అంతిమంగా పాక్ ఆర్థిక రంగానికి ఊతమిస్తాయని ఇమ్రాన్ తెలిపారు.
ఇదీ చూడండి: 'శివసేనతో సీఎం పదవిపై ఒప్పందం జరగలేదు'