కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు 13 నెలలకే సభా విశ్వాసం కోల్పోయింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య, సుదీర్ఘంగా సాగిన చర్చ తర్వాత బలపరీక్షలో కుమారస్వామి ఓడిపోయారు.
ఉదయం నుంచి వాడీవేడిగా జరిగిన చర్చ అనంతరం ముఖ్యమంత్రి కుమారస్వామి ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. తర్వాత స్పీకర్ రమేశ్ కుమార్ ఓటింగ్ నిర్వహించారు. ఆ సమయంలో సభలో మొత్తం 204 మంది సభ్యులు ఉన్నారు. అధికారం నిలుపుకునేందుకు కనీసం 103 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కూటమికి 99 ఓట్లు మాత్రమే రాగా... భాజపాకు 105 ఓట్లు వచ్చాయి.
"కాంగ్రెస్-జేడీఎస్ కూటమి విశ్వాస పరీక్షలో ఓడిపోయింది. సొంత పార్టీ ఎమ్మెల్యేల ద్రోహమే ఇందుకు కారణం. ఇలా ద్రోహం చేసేవారిని కర్ణాటక ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరు."
-హెచ్‌కే పాటిల్, కాంగ్రెస్ నేత
13 నెలలకే...
కర్ణాటక శాసనసభలో మొత్తం సీట్ల సంఖ్య 224. అధికారంలో ఉండాలంటే కనీసం 113 మంది సభ్యుల బలం అవసరం.
78 మంది సభ్యులున్న కాంగ్రెస్, 37 మంది ఎమ్మెల్యేలున్న జేడీఎస్, ఒక సభ్యుడున్న బీఎస్పీ, ఇద్దరు స్వతంత్రులతో కుమారస్వామి నేతృత్వంలో గతేడాది సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆరంభంలో అధికార పక్ష బలం 118. భాజపాకు 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
కాంగ్రెస్-జేడీఎస్ కూటమిలో సంక్షోభం జులై 6న మొదలైంది. రెండు పార్టీలకు చెందిన 16 మంది శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్పీకర్ కార్యాలయానికి వెళ్లి లేఖలు సమర్పించారు.
సంకీర్ణ కూటమిలో భాగస్వాములైన ఇద్దరు స్వతంత్రులు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. భాజపా పక్షాన చేరారు.
రసవత్తర రాజకీయాలు...
రిసార్ట్ రాజకీయాలు, సుప్రీంకోర్టులో కేసులు, బుజ్జగింపులతో కర్ణాటక రాజకీయాలు కొద్దిరోజులుగా నాటకీయ మలుపులు తిరిగాయి. 16 మంది అసంతృప్తుల్లో ఒకరు సొంత గూటికి తిరిగి రాగా... మిగిలిన వారు ముంబయికే పరిమితం అయ్యారు.
బలపరీక్షకు సిద్ధమని జులై 12న సీఎం కుమారస్వామి ప్రకటించారు. విశ్వాస తీర్మానంపై గతవారమే చర్చే ప్రారంభమైనా... ఓటింగ్ మాత్రం జరగలేదు. బలపరీక్షను వాయిదా వేయిస్తూ... 15 మంది రెబల్స్‌ను దారికి తెచ్చుకునేందుకు కాంగ్రెస్-జేడీఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.
అనేక మలుపుల అనంతరం ఎట్టకేలకు నేడు బలపరీక్ష సాధ్యమైంది. కుమారస్వామి ప్రభుత్వం అధికారం కోల్పోయింది.
భాజపా హర్షం...
కూటమిలో సంక్షోభం మొదలైన నాటి నుంచి భాజపా ఆచితూచి వ్యవహరించింది. అసంతృప్తులతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ వచ్చింది. బలపరీక్షను వాయిదా వేస్తూ వచ్చినా... ఓపికగా వ్యవహరించింది.
చివరకు విశ్వాసపరీక్షలో కుమారస్వామి ఓడిపోవడంపై కమలదళం హర్షం వ్యక్తంచేసింది. కర్ణాటకలో మరోమారు అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.