తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బలపరీక్ష జరుగుతుందని సుప్రీం ఆశాభావం - కుమారస్వామి

కుమారస్వామి తక్షణమే విశ్వాసపరీక్ష ఎదుర్కొనేలా ఆదేశించాలని దాఖలైన వ్యాజ్యంపై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. బలపరీక్ష ఈరోజే పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తంచేసింది.

కర్​'నాటకం': 'బలపరీక్ష'పై సుప్రీం సానుకూలం

By

Published : Jul 23, 2019, 1:43 PM IST

Updated : Jul 23, 2019, 5:12 PM IST

కన్నడ రాజకీయ సంక్షోభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కీలక పరిణామాల నేపథ్యంలో.. స్వతంత్ర ఎమ్మెల్యేల పిటిషన్​పై వాదనలు విన్న అనంతరం విచారణ రేపటికి వాయిదా వేసింది. బలపరీక్ష ఇవాళ పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది అత్యున్నత న్యాయస్థానం.

బలపరీక్షను వెంటనే జరిపేలా ఆదేశించాలని సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్లు దాఖలు చేశారు కర్ణాటక స్వతంత్ర ఎమ్మెల్యేలు శంకర్​, నగేశ్​. వెంటనే విచారణ జరిపించాలన్న విజ్ఞప్తిని తిరస్కరించిన కోర్టు.. నేడు వాదనలు విన్న అనంతరం రేపటికి వాయిదా వేసింది.

రోహత్గీ, సింఘ్వీ వాదనలు...

రాజీనామా చేసిన ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది ముకుల్​ రోహత్గీ, స్పీకర్​ తరఫున అభిషేక్​ సింఘ్వీ వాదనలు వినిపించారు. రెబల్స్​ తరఫున వాదించిన రోహత్గీ.. ఈ రోజు సాయంత్రం 6 గంటల్లోగా బలపరీక్ష జరిపించేలా ఆదేశించాలని కోర్టును కోరారు.

స్పీకర్​ తరఫున వాదించిన సింఘ్వీ.. విశ్వాస పరీక్షపై ఈ రోజు చర్చ పూర్తవుతుందని.. అనంతరం బలపరీక్ష నిర్వహిస్తామని నివేదించారు. వీరి వాదనలు పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం.. విచారణను రేపటికి వాయిదా వేసింది.

సభలో వాడీవేడి చర్చ..

విశ్వాస పరీక్ష అంశంపై కర్ణాటక విధానసభలో వాడీవేడి చర్చ కొనసాగుతోంది. అయితే.. సభకు ఎక్కువ మంది హాజరుకాకపోవడం వల్ల బలనిరూపణ అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చ ముగించి.. బలపరీక్ష జరిపిస్తానని కోర్టుకు తెలిపారు స్పీకర్​ రమేశ్​ కుమార్​.

కుమారస్వామి ఎక్కడ..?

సభలో చర్చ కొనసాగుతున్నా ముఖ్యమంత్రి కుమారస్వామి ఇంతవరకూ అసెంబ్లీకి చేరుకోలేదు. బలనిరూపణ అంశంపై బయట వేర్వేరుగా చర్చలు జరుపుతున్నారు. అంతకుముందు.. కాంగ్రెస్​ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు సీఎం. అనంతరం.. మాజీ ప్రధాని దేవేగౌడతో సంప్రదింపులు జరిపారు కుమారస్వామి.
సుప్రీంకోర్టు కూడా బలపరీక్షపై ఆశాభావం వ్యక్తం చేసిన నేపథ్యంలో నేడు ఏం జరుగుతుందోనని అంతటా ఆసక్తి నెలకొంది. అందరి దృష్టి కర్ణాటకపైనే నెలకొంది.

Last Updated : Jul 23, 2019, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details