కర్ణాటలోని కాలాబర్గికి చెందిన మహాదేవి.. చిన్నవయసులోనే భర్తను కోల్పోయింది. ఆ సమయంలో ఇద్దరు పిల్లలతో జీవితాన్ని నెట్టుకురావడం చాలా కష్టంగా మారింది ఆమెకు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న మహాదేవి.. ఓసారి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. అయితే.. ముఘల్కోడ్కు చెందిన ఓ స్వామీజీ ఆమెలో ధైర్యం నింపి, రొట్టెలు అమ్ముకుని జీవనం సాగించాలని సలహా ఇచ్చాడట. ఆయన ఆశీస్సులతో రొట్టెల తయారీ ప్రారంభించిన మహాదేవి.. ప్రస్తుతం 200 మంది మహిళలు తమ కాళ్లపై తాము నిలబడగలిగేలా చేసింది.
"32 ఏళ్ల నుంచీ నేనీ పని చేస్తున్నాను. జొలిగే అప్పోరా ఆశీర్వాదంతో రొట్టెలు చేయడం ప్రారంభించాను. నాదగ్గర ప్రస్తుతం 150 నుంచి 200 మంది వరకు పనిచేస్తున్నారు."
- మహాదేవి, యజమాని
రూ. 3కే రొట్టె..
మహాదేవి వంటశాలలోని మహిళలు వేల కొద్దీ రొట్టెలు, చపాతీలు, ధపాతీలు, హోలిగే తయారుచేస్తారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో సాధారణంగా ఒక్కో రొట్టెను 10 నుంచి 12 రూపాయలకు విక్రయిస్తారు. కానీ.. మహాదేవి 3 రూపాయలకే ఒక రొట్టె అందిస్తోంది. ఈ పనిని ఓ సేవగా భావిస్తున్న ఆమె.. భోజనం కొనుక్కునే స్థోమత లేనివారికి ఉచితంగానే రొట్టెలు అందిస్తోంది. ఆకలితో బాధపడేవారెవరూ ఉండొద్దన్నదే తన లక్ష్యమని చెప్తోంది మహాదేవి. విద్యార్థులకైతే ఒక రూపాయి లేదా రెండు రూపాయలకే రొట్టెలు అమ్ముతోంది.