కన్నడనాట మలుపులు... జేడీఎస్ అధ్యక్షుడి రాజీనామా కన్నడనాట కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ రాజకీయాలు రోజుకో మలుపు తిరగుతున్నాయి. జేడీఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు హెచ్.విశ్వనాథ్. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి పట్ల నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్లు తెలిపారు.
పార్టీలో ఇటీవలతనకు ప్రాధాన్యం తగ్గిందని, కీలక నిర్ణయాల్లో తనతో సంప్రదింపులు జరపట్లేదని విశ్వనాథ్ అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కూటమి సమన్వయ కర్తగా కాంగ్రెస్ నేత సిద్దరామయ్య పనితీరుపై ఇటీవలి కాలంలో బాహాటంగానే అసహనం వ్యక్తం చేశారు విశ్వనాథ్.
కొందరు అసంతృప్త ఎమ్మెల్యేల వల్ల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదముందని అంచనా వేసిన కుమారస్వామి.. మంత్రివర్గాన్ని విస్తరించాలకున్నారు. ఈ దిశగా కాంగ్రెస్-జేడీఎస్ మధ్య వరుస భేటీలు జరుగుతూనే ఉన్నాయి.
ఈ విస్తరణపైనా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెదవి విరుస్తున్నారు. శాఖల కేటాయింపులు న్యాయంగా జరగాలని గళమెత్తుతున్నారు.
మంత్రివర్గ విస్తరణపై వ్యంగ్యంగా అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే రామలింగా రెడ్డి. జేడీఎస్‌కు వెన్నెను, కాంగ్రెస్‌కు నిమ్మరసాన్ని పంచినట్టు శాఖల కేటాయింపు ఉండకూడదని అభిప్రాయపడ్డారు. రామలింగారెడ్డికి కేబినెట్లో చోటు కల్పించాలని ఆయన మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట నిరసనలు చేపట్టారు.