తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తేలని కర్నాటకం... రేపటికి సభ వాయిదా - kumaraswamy

కర్ణాటక రాజకీయాలు క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్ష వ్యవహారం సోమవారం అర్ధరాత్రి అయినా ఎటూ తేలకపోవటం వల్ల విధాన సభ మంగళవారం ఉదయం 10 గంటల వరకు వాయిదా పడింది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు చర్చ కొనసాగించి 6 గంటలకు విశ్వాస పరీక్ష నిర్వహిస్తామని స్పీకర్​ రమేశ్ కుమార్​ స్పష్టం చేశారు.

కర్ణాటక

By

Published : Jul 23, 2019, 1:15 AM IST

Updated : Jul 23, 2019, 4:28 PM IST

గంటకో మలుపు తిరుగుతున్న కర్ణాటక రాజకీయాలు ఉత్కంఠను కొనసాగిస్తున్నాయి. కొన్ని రోజులుగా రాష్ట్రంలో మొదలైన రాజకీయ సంక్షోభం ఇంకా వీడలేదు. సోమవారం అర్ధరాత్రి వరకూ కొనసాగిన విధాన సభలోనూ బలపరీక్ష వ్యవహారం కొలిక్కిరాలేదు. ఈ నేపథ్యంలో సభ మంగళవారానికి వాయిదా పడింది.

పరీక్ష జరగాల్సిందే..

మంగళవారం సాయంత్రం 4గంటలకు బలాన్ని నిరూపించుకోవాలని స్పీకర్‌ రమేశ్ కుమార్‌ అధికార పక్షానికి డెడ్‌లైన్‌ విధించారు. బల నిరూపణకు రాత్రి 8 గంటల వరకు సీఎల్పీ నేత సిద్ధరామయ్య సమయం కోరారు. అందుకు సాధ్యం కాదని స్పీకర్‌ రమేశ్ కుమార్​ తేల్చి చెప్పారు. ఫలితంగా మంగళవారమే విశ్వాస ప్రక్రియ పూర్తి చేస్తామని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.

చర్చ తర్వాత బలపరీక్ష!

కాంగ్రెస్‌ తరఫున కొంత మంది మాట్లాడాల్సి ఉందని స్పీకర్‌ను కోరారు సిద్ధరామయ్య. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న స్పీకర్​.. మంగళవారం సాయంత్రం 4 గంటలలోపు చర్చను ముగించాలని సూచించారు. అనంతరం సాయంత్రం 6గంటలకు విశ్వాస పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

రోజంతా గందరగోళమే..

రెండు రోజుల విరామం తర్వాత సోమవారం ప్రారంభమైన విధాన సభలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. విశ్వాస పరీక్షను ఈ రోజే చేపట్టాలని ప్రతిపక్షం.. వాయిదా వేయాలని అధికార పక్షం పట్టుబట్టిన నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొంది.

ఎంత రాత్రయినా సభలోనే ఉంటామనీ.. బల నిరూపణ పూర్తి చేయాల్సిందేనని ప్రతిపక్ష నేత యడ్యూరప్ప పట్టుబట్టారు. ముందుగా ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారాన్ని తేల్చాలని సీఎం కుమారస్వామి తేల్చిచెప్పారు. విప్​ జారీపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంతవరకు బలపరీక్ష నిర్వహించవద్దని ఆయన స్పీకర్‌ను కోరారు. అధికార పార్టీ సభ్యులు సభను మంగళవారానికి వాయిదా వేయాలని కోరారు.

ఇదీ చూడండి: కర్ణాటకపై రాజ్యసభలో రగడ... 3సార్లు వాయిదా

Last Updated : Jul 23, 2019, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details