ఆయన రాజా! అని పిలిస్తే చాలు.. దగ్గర్లోని అడవిలోంచి నెమళ్లు పరిగెత్తుకుంటూవస్తాయి. పిలిచినప్పుడల్లా వచ్చి, ఆయన పెట్టే ఆహారంతో కడుపునింపుకుంటాయి. ఆయనతో కలిసి ఆడిపాడతాయి, కుటుంబసభ్యుల్లాగా కలిసి గడుపుతాయి. ఆయన వెళ్లిపోగానే అవి కూడా అడవిలోకి తిరుగుపయనమవుతాయి. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరాజ్‌లో.. నెమళ్లకు ఆ వ్యక్తితో ఉన్న అపురూప బంధాన్ని చూసేందుకు పెద్దఎత్తున పర్యటకులు వస్తారు. ఈయన పేరు కన్హూ బెహెరా. జూనియర్ పీకాక్ మ్యాన్‌గా.. పీకాక్ వ్యాలీలో అందరికీ సుపరిచితమే. ఒడిశాలోనే మొదటి పీకాక్ మ్యాన్‌గా పేరుగాంచిన పనూ బెహెరా మనవడు ఈయన. 1999లో తుపాను సంభవించిన తర్వాత.. తనకు కనిపించిన 3 నెమళ్ల సంరక్షణ బాధ్యతలు తీసుకున్నాడు పనూ. వాటిపై పనూకి ఉన్న ప్రేమతో పాటు.. నెమళ్ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2017, మేనెలలో పనూ మరణించిన తర్వాత.. నెమళ్ల బాధ్యతను భుజాలపై వేసుకున్నాడు ఆయన మనవడు కన్హూ. కుటుంబసభ్యుల్లాగే వాటిని ప్రేమగా చూసుకోవడం ప్రారంభించాడు. జంతువులు, పక్షులపై ఆయన కురిపిస్తున్న ప్రేమను చూసి, పావురాలు, మైనాల్లాంటి ఇతర జాతుల పక్షులూ ఆహారం కోసం ఒక్కచోటికి చేరుతున్నాయి.
" 2017, మేలో మా తాత చనిపోయారు. అప్పటినుంచి మూడేళ్లుగా నేనే నెమళ్లకు ఆహారం పెడుతున్నా. ఆయన చనిపోయిన సమయంలో 67 నెమళ్లు ఉండేవి. ప్రస్తుతం వాటిసంఖ్య 132కు పెరిగింది. 21 ఏళ్లుగా ఈ పీకాక్ వ్యాలీలో నెమళ్లతో నా స్నేహం కొనసాగుతోంది. భవిష్యత్తులోనూ కొనసాగిస్తా."
- కన్హూ చరన్ బెహెరా, జూనియర్ పీకాక్ మ్యాన్
ఉదయాన్నే నిద్రలేచి, నెమళ్లకు ఆహారం పెట్టేందుకు అడవికి వెళ్తాడు కన్హూ. వివిధ రకాల గింజలను ఉదయం ఐదున్నర నుంచి ఏడున్నర మధ్య ఓసారి, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య మరోసారి వాటికి ఆహారంగా అందిస్తాడు. నెమళ్ల కడుపు నింపేందుకు ఆయన రోజుకు సగటున 500 నుంచి 600 రూపాయలు ఖర్చుపెడతాడు. నెమళ్లపై ఆప్యాయత కురిపిస్తున్న కన్హూకు స్థానికులు, పర్యటకులు ఆర్థికంగా సాయం చేస్తున్నారు. ఆ డబ్బుతోనూ నెమళ్లకు అవసరమయే ధాన్యపు గింజలు కొంటున్నాడు కన్హూ.
" దేవుడిదయ, నా చుట్టుపక్కల ప్రజల సహకారంతోనే నేను ఇదంతా చేయగలుగుతున్నాను. వాటి కడుపు నింపేందుకు రోజుకు 500 నుంచి 600 రూపాయలు ఖర్చుచేస్తాను. ఇక్కడికి పర్యటనకు వచ్చేవాళ్లు ఆర్థికంగా సహాయం చేస్తారు. వారి సహకారం లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు."
- కన్హూ చరన్ బెహెరా, జూనియర్ పీకాక్ మ్యాన్