కమల్‌హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర భారత దేశంలో మొదటి ఉగ్రవాది హిందువేనని, ఆయన పేరు నాథూరాం గాడ్సే అని వ్యాఖ్యానించారు.
తమిళనాడులోని అరవకురిచిలో ఆదివారం రాత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు.
"నేను ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వచ్చినందుకు ఈ మాటలు చెప్పడం లేదు. మహాత్మా గాంధీ విగ్రహం ముందే చెబుతున్నా. స్వతంత్ర భారత మొదటి ఉగ్రవాది ఓ హిందువు. ఆయన పేరు నాథూరాం గాడ్సే. అక్కడే ఇది(ఉగ్రవాదం) మొదలైంది."
-- కమల్ హాసన్, ఎంఎన్ఎం అధినేత
1948లో జరిగిన మహాత్మా గాంధీ హత్యను ప్రస్తావిస్తూ ఆ ఘటనకు సంబంధించిన సమాధానాలు తనకు కావాలన్నారు కమల్.
"మంచి భారతీయులు దేశంలో సమానత్వం కావాలని కోరుకుంటారు. త్రివర్ణ పతాకంలోని మూడు రంగులు ఒకదాన్ని ఒకటి అంటకుండా ఉండాలనుకుంటారు. నేను మంచి భారతీయుడినే. నేను ఆ విషయాన్ని చెప్పేందుకు గర్విస్తున్నా."
-- కమల్ హాసన్, ఎంఎన్ఎం అధినేత
2017 నవంబర్లోనూ హిందూ ఉగ్రవాదం అంటూ వ్యాఖ్యలు చేశారు కమల్. వాటిని భాజపా నేతలు, హిందూ సంస్థలు తీవ్రంగా ఖండించాయి.
ఈ నెల 19న ఉప ఎన్నికలు జరిగే నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అవరకురిచి ఒకటి. అక్కడి నుంచి ఎంఎన్ఎం తరఫున ఎస్.మోహన్ రాజ్ పోటీ చేస్తున్నారు.
ఇదీ చూడండి : 'నన్ను మందలించగలిగే వారు ఆమె ఒక్కరే'