దేశంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, హింసాత్మక ఘటనలను అరికట్టాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి. దేశంలో అసలు ఆడబిడ్డలకు ఏం జరుగుతుందని ప్రశ్నించిన కైలాశ్.. ఇది జాతికే అవమానకరమని అభిప్రాయపడ్డారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్ ఘటనపై స్పందిస్తూ.. ప్రధాని మోదీ అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరు ప్రారంభించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం తనతో సహా.. యావత్ భారతదేశం మోదీకి మద్దతిస్తుందని తెలిపారు.