కరోనా వేళ ముఖాన్ని కప్పేస్తున్న మాస్కునే ప్రత్యేక ఆకర్షణగా మార్చేశాడు గుజరాత్‌కు చెందిన ఓ నగల వ్యాపారి. మాస్కుకు వజ్రాలు పొదిగి.. కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు.
సూరత్‌లోని కుషాల్భాయి నగల దుకాణం యజమాని దీపక్ ఛోక్సీ. కరోనా వేళ బంగారు, వెండి మాస్కులు సర్వసాధారణం అయిపోయాయనుకున్న ఓ కస్టమర్ దీపక్ షాపుకొచ్చాడు. వారింట్లో జరుగుతున్న పెళ్లిలో.. వధూవరులు ధరించేందుకు కనీవినీ ఎరుగని రీతిలో మాస్కులు కావాలని కోరాడు. అప్పుడే, దీపక్‌కు ఈ ఆలోచన వచ్చింది. ఇంకేముంది.. ఒక్కోటి సుమారు రూ.1.5 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు ఖరీదు చేసే డైమండ్ మాస్క్‌లను తయారుచేసేశాడు.
"ఓ కస్టమర్ ఇంట్లో పెళ్లి జరుగుతోంది . ఆయన మా షాపుకు వచ్చి.. వధూవరులకు ప్రత్యేకమైన మాస్కులు కావాలన్నారు. అప్పుడు మా డిజైనర్లకు చెప్పి వజ్రాల మాస్కు తయారు చేయించాను. ఆ మాస్కు బాగా నచ్చి, వచ్చిన కస్టమర్ దానిని తీసుకెళ్లారు. ఆ తర్వాత, అలాంటి మాస్కులు మరిన్ని తయారు చేయించాను. వీటిని తయారు చేసేందుకు నాణ్యమైన వజ్రాలతో పాటు, అమెరికన్ డైమండ్, బంగారం ఉపయోగించాం."