బంగాల్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు పలు ప్రాంతీయ పార్టీలు బరిలో నిలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే.. రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ క్రమంలోనే బంగాల్ ఎన్నికల బరిలో జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ)ను నిలిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. 75 స్థానాల్లో పోటీపడే అభ్యర్థులనూ గుర్తించారు. అయితే.. బంగాల్ ఎన్నికలపై జేడీయూ ప్రభావమెంత? దీని వల్ల ఏ పార్టీపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఏ పార్టీకి జేడీయూ వల్ల మేలు జరగనుంది?.
బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని బరిలో నిలపటమే లక్ష్యంగా గురువారం ఆ రాష్ట్రంలోని పలువురు జేడీయూ కార్యకర్తలను కలిశారు నితీశ్ కుమార్. కానీ ఎన్నికలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే.. డిసెంబర్ 26, 27 తేదీల్లో జరిగే పార్టీ జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశంలో పూర్తి వివరాలు వెలువడనున్నాయి.
" జేడీయూ బంగాల్ విభాగం ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటోంది. పోటీ చేసేందుకు 75 సీట్లను ఇప్పటికే గుర్తించాం. జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. జాతీయ అధ్యక్షుడి ముందు బంగాల్ వంటి ఇతర రాష్ట్రాల నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. "
- బలియావి, జేడీయూ బంగాల్ ఇంఛార్జి
ఓటు బ్యాంక్ నిల్..!
బంగాల్లో జేడీయూకు ఓటు బ్యాంకు లేదు. పార్టీ ట్రాక్ రికార్డును పరిశీలిస్తే.. ఇతర రాష్ట్రాల్లో నితీశ్ పార్టీ దారుణంగా విఫలమైనట్లు తెలుస్తోంది. దిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయింది. ఒక్క ప్రాంతంలోనూ ఖాతా తెరవలేకపోయింది.
మరోవైపు.. పలువురు సీనియర్ నేతలు బంగాల్లో జేడీయూ పుంజుకుంటుందని పేర్కొంటున్నారు. నితీశ్ ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులు బంగాల్ ఓటర్లను ఆకర్షిస్తాయని చెబుతున్నారు. మద్య నిషేధం అమలును బంగాల్ ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవాలని నితీశ్ చూస్తున్నారు.
భాజపా మాటేంటి?
బంగాల్ ఎన్నికల్లో జేడీయూ పోటీ చేసినప్పటికీ తమపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది.. బిహార్లో దాని మిత్రపక్షం భాజపా. ఈసారి పూర్తిస్థాయి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు కాషాయ పార్టీ ప్రతినిధి వివేకానంద పాసవాన్.