శ్రీలంక బాంబు పేలుళ్ల ఘటనలో నలుగురు జేడీఎస్ నేతలు మృతిచెందారు. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ధ్రువీకరించారు. పార్టీ సభ్యుల మరణం కలచివేసిందని ట్వీట్ చేశారు. భారత విదేశాంగ శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.
లక్ష్మణ గౌడ రమేష్, కేఎమ్ లక్ష్మీనారాయణ, ఎమ్ రంగప్ప, కేజీ హనుమంతరాయప్ప పేలుళ్లకు ప్రాణాలు కోల్పాయారు. మరో ముగ్గురు నేతలు హెచ్ శివకుమార్, ఏ మారెగౌడ, హెచ్ పుట్టరాజు గల్లంతయ్యారు.
శ్రీలంకలో జేడీఎస్ నాయకులు ఏడుగురు జేడీఎస్ నేతలు ఈనెల 20న కొలంబో చేరుకున్నారు. అక్కడి షంగ్రీలా హోటల్లో బసచేశారు. పేలుళ్ల ఘటన తర్వాత కుటుంబసభ్యులకు వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. వీరిలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అనేక గంటల తర్వాత తెలిసింది. మిగిలిన వారి పరిస్థితిపై ఇంకా స్పష్టత లేదు.
శ్రీలంకలో ఆదివారం జరిగిన మారణకాండలో 290మంది మృతిచెందారు. మరో 500 మంది ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు.
ఇదీ చూడండి:శ్రీలంకలో మరో బాంబు నిర్వీర్యం- భయంతో జనం