దక్షిణాదిలో తొలిసారిగా భాజపా అధికారంలోకి వచ్చిన రాష్ట్రం కర్ణాటక. అయితే భాజపా ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రభుత్వం స్థిరంగా ఉండకపోవటం... ముఖ్యమంత్రులు మారడం ఇక్కడ సాధారణమే. 14 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లోనూ భాజపాకు అత్యధిక స్థానాలు వచ్చినా.... అధికారం చేపట్టేందుకు అవసరమైన 113 సీట్లను సాధించలేకపోయింది.
అత్యధిక స్థానాలు పొందిన పార్టీగా భాజపా నుంచి యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి చేపట్టినా.... అది మూణ్నాల్ల ముచ్చటే అయింది. సభలో బలం నిరూపించుకోలేక రాజీనామా చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ వేగంగా పావులు కదిపి జేడీఎస్ కు మద్దతు తెలిపి కుమారస్వామిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టింది.
అయితే 14 నెలల సంకీర్ణ సర్కారు.. చిట్టచివరికి 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామాతో విశ్వాసపరీక్షలో ఓడి కూలిపోయింది. ఆ వెంటనే ముఖ్యమంత్రి పదవికి కుమార స్వామి రాజీనామా చేశారు. లేఖను గవర్నర్ వాజుభాయ్ వాలాకు అందజేశారు. ఆయన వెంటనే రాజీనామా ఆమోదించి... కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు.
యడ్యూరప్పనే వరిస్తుందా?
ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై గవర్నర్ తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రతిపక్ష స్థానంలో ఉన్న భాజపాను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించటం లాంఛనం కానుంది. భాజపా తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా యడ్యూరప్పకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇవాళ భాజపా ఎమ్మెల్యేలు సమావేశమై శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం శాసన సభలో బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది.