తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుదీర్ఘ యుద్ధంలో ఇది విజయానికి నాంది: మోదీ - కరోనా వైరస్

janatha
జనతా కర్ఫ్యూ

By

Published : Mar 22, 2020, 6:31 AM IST

Updated : Mar 22, 2020, 8:46 PM IST

20:43 March 22

సుదీర్ఘ యుద్ధంలో ఇది విజయానికి నాంది: మోదీ 

కరోనా వైరస్‌ వ్యాప్తి నిర్మూలనకుకు చేపట్టిన 'జనతా కర్ఫ్యూ'లో యావత్‌ భారత్‌ పాల్గొన్నందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. కరోనాపై చేస్తున్న సుదీర్ఘ యుద్ధంలో ఇది విజయానికి నాంది అని అన్నారు. ''ఇది కృతజ్ఞతలు తెలుపుతున్న శబ్దం. సుదీర్ఘ యుద్ధంలో విజయానికి నాంది. ఇదే సంకల్పం, సంయమనంతో సుదీర్ఘ యుద్ధం కోసం మిమ్మల్ని సామాజిక దూరం చేసుకోండి'' అని ట్వీట్‌ చేశారు. 

20:00 March 22

దేశంలో జనతా కర్ఫ్యూలో భాగంగా అత్యవసర సేవల్లో పాల్గొన్న వారికి సంఘీభావం ప్రకటించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. చప్పట్లు కొడుతూ.. వైద్యులు, మీడియా ప్రతినిధులు, పోలీసులకు మద్దతుగా నిలిచారు. 

18:05 March 22

జనతా కర్ఫ్యూలో భాగంగా.. అత్యసవర సేవల్లో పాల్గొన్న సిబ్బందికి సంఘీభావంగా భారత సంతతికి చెందిన సింగపూర్​ వాసులు కూడా చప్పట్లు కొట్టారు. గంటలు కూడా మోగించి.. మీ వెంట మేమున్నామంటూ మద్దతు పలికారు. 

17:50 March 22

కేంద్ర మంత్రులు, ఎంపీల సంఘీభావం..

  • కుటుంబసభ్యులతో కలిసి చప్పట్లు కొట్టిన రాష్ట్రపతి కోవింద్‌
  • కుటుంబసభ్యులతో కలిసి ఇళ్ల వద్ద చప్పట్లు కొట్టిన కేంద్రమంత్రులు, ఎంపీలు
  • లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్​నాథ్​ సింగ్​, ధర్మేంద్ర ప్రధాన్​, ప్రకాశ్​ జావడేకర్​, ఎన్సీపీ సీనియర్​ నేత శరద్​ పవార్​, భాజపా అధ్యక్షుడు నడ్డా, ఇతర రాష్ట్రాల సీఎంలు, నేతలంతా చప్పట్లు కొట్టి సంఘీభావంగా గంటలు మోగించారు.

17:20 March 22

చప్పట్లతో సంఘీభావం..

జనతా కర్ఫ్యూకు దేశవ్యాప్తంగా ప్రజల సంఘీభావం

జాతి యావత్తూ చప్పట్లతో సంఘీభావం

జనతా కర్ఫ్యూ విజయానికి సూచికగా ఇళ్ల నుంచే చప్పట్లు, ఘంటానాదాలు

పల్లెలు, పట్టణాలు, నగరాల్లో స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ

16:37 March 22

జనతా కర్ఫ్యూతో బోసిపోయిన వీధులు, రహదారులు...

దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటిస్తున్న ప్రజలు

ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇళ్లకే పరిమితమైన జనం

ప్రతి రాష్ట్రంలో దాదాపు కర్ఫ్యూ వాతావరణం

వాహనాలు లేక బోసిపోయిన వీధులు, రహదారులు

మూతపడిన దుకాణాలు, షాపింగ్‌ మాళ్లు, థియేటర్లు

మూతపడిన హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్బులు, బార్లు

దిల్లీ, గోవాలోని చర్చిల్లో సామూహిక ప్రార్థనలు రద్దు

కశ్మీర్‌ మసీదుల్లో ప్రార్థనలు నిలిపివేస్తున్నట్లు వక్ఫ్ బోర్డు ప్రకటన

16:31 March 22

దిల్లీలో నెలాఖరు వరకు 144 సెక్షన్​

కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో ఇవాళ రాత్రి 9 గంటల నుంచి.. మార్చి 31 అర్ధరాత్రి వరకు 144 సెక్షన్​ విధిస్తున్నట్లు పేర్కొంది. 

16:26 March 22

5 శాతం మందికే చికిత్స అవసరం: కేంద్రం

కొవిడ్​-19 బారిన పడిన 5 శాతం మందికి మాత్రమే ఆసుపత్రిలో చికిత్స అవసరమని కేంద్రం తెలిపింది. 

16:21 March 22

విదేశాల్లో ఉన్నవాళ్లు ఇంకా మనదేశానికి వస్తున్నారు: కేంద్ర ఆరోగ్యశాఖ

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ కోసమే జనతా కర్ఫ్యూ: కేంద్రం

విదేశాల నుంచి వచ్చేవాళ్లను తొలుత ఐసొలేట్ చేస్తున్నాం: కేంద్రం

అందరికీ వైద్యపరీక్షలు చేసి పరిశీలనలో ఉంచుతున్నాం: కేంద్రం

కరోనాను ఎదుర్కొనేందుకు ప్రజలంతా ముందుకొచ్చారు: కేంద్ర ఆరోగ్యశాఖ

జనతా కర్ఫ్యూకు మంచి స్పందన వచ్చింది: కేంద్ర ఆరోగ్యశాఖ

కరోనా వ్యాప్తి నివారణే మన కర్తవ్యం: కేంద్ర ఆరోగ్యశాఖ

ఈనెల 31 వరకు సబర్బన్‌, మెట్రో రైళ్లు నిలిపివేస్తున్నాం: కేంద్ర ఆరోగ్యశాఖ

కరోనా పాజిటివ్ బయటపడిన 75 జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించాలని కోరాం: కేంద్రం

16:17 March 22

సామాజిక దూరం పాటించడం తప్పనిసరి...

వ్యక్తికి వ్యక్తికి ఒక మీటర్‌ దూరం పాటించడంతో కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు: కేంద్ర ఆరోగ్యశాఖ

మనదేశంలో కరోనా పరీక్షలు చేసే ల్యాబ్‌లు 111 ఉన్నాయి: కేంద్ర ఆరోగ్యశాఖ

మనదేశంలో వారానికి 10వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగలుగుతున్నాం: కేంద్ర ఆరోగ్యశాఖ

16:14 March 22

ఈ నెల 31 వరకు మెట్రో సేవలు బంద్​..

అత్యవసర రవాణా సేవలు మాత్రమే నడపాలని రాష్ట్రాలకు చెప్పాం: కేంద్రప్రభుత్వం

కరోనా కేసులు ఎక్కువ ఉన్న 75 జిల్లాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించాలని రాష్ట్రాలకు చెప్పాం: కేంద్రప్రభుత్వం

రైలు ప్రయాణికుల ద్వారా కరోనా వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది: కేంద్ర ఆరోగ్యశాఖ

ఈ నెలాఖరు వరకు ఆయా రాష్ట్రాల్లో మెట్రో రైలు సేవలు నిలిపివేయాలని సూచించాం

మనదేశంలో కరోనా బాధితుల్లో లక్షణాలు ఆలస్యంగా కనిపిస్తున్నాయి

కొందరు బాధితుల్లో 7 రోజుల తర్వాత కరోనా పాజిటివ్ వస్తోంది

15:46 March 22

'మహా'లో బస్సు సర్వీసుల బంద్​ పొడిగింపు...

మహారాష్ట్రలో ఇంటర్​సిటీ బస్సు సర్వీసుల్ని మార్చి 31వరకు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే. అత్యవసర సేవల్లో పాల్గొనే వారి కోసం మాత్రం బెస్ట్​(బృహన్​ముంబయి ఎలక్ట్రిక్​ సప్లై అండ్​ ట్రాన్స్​పోర్ట్​) సర్వీసు బస్సుల్ని నడుపుతామని స్పష్టం చేశారు. బ్యాంకులు, షేర్​ మార్కెట్లు తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. 

  • మహారాష్ట్రలోనూ జనతాకర్ఫ్యూ సమయం పొడిగింపు
  • రేపు ఉదయం వరకు జనతాకర్ఫ్యూ పాటించాలని మహారాష్ట్ర సీఎం పిలుపు
  • మహారాష్ట్రలో తదుపరి ఆదేశాల వరకు 144 సెక్షన్‌ కొనసాగుతుంది: ఉద్ధవ్‌ఠాక్రే

14:41 March 22

కేంద్రం మార్గదర్శకాలు

లాక్​డౌన్​...

కరోనా విజృంభిస్తోన్న వేళ కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా కరోనా వెలుగులోకి వచ్చిన 75 జిల్లాలను లాక్​డౌన్​ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. దేశవ్యాప్తంగా బస్సు సర్వీసులను ఈ నెల 31 వరకు నిలిపివేసింది.

13:05 March 22

రైల్వే బోర్డ్ అత్యవసర సమావేశం...

  • దేశవ్యాప్తంగా ఈనెల 31 వరకు అన్ని రైళ్లను నిలిపివేయాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.
  • రైళ్ల సంఖ్యను తగ్గించడం వల్ల కుదించిన రైళ్లలోనే ఎక్కువ మంది ప్రయాణిస్తున్నట్లు గుర్తించిన రైల్వే.
  • క్వారన్ టైన్ సెంటర్ల నుంచి తప్పించుకుని వెళ్లే వారు...రైళ్లలోనే వస్తున్నట్లు రైల్వే అధికారుల దృష్టికి వచ్చింది.
  • కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రైళ్లను రద్దు చేయడమే మేలని అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

13:03 March 22

చండీగఢ్​లో కర్ఫ్యూ...

జనతా కర్ప్యూ నేపథ్యంలో చండీగఢ్​లోని కూరగాయల మార్కెట్​ అంతా ఖాళీగా కనిపిస్తోంది.

12:14 March 22

అంతా నిర్మానుష్యం...

జనతా కర్ఫ్యూలో భాగంగా దిల్లీలోని జామియా మసీదు, దర్యాగంజ్​ ప్రాంతాలు నిర్మానుష్యంగా ఉన్నాయి.

12:13 March 22

ఖాళీగా గోవా బీచ్​...

ఎప్పుడూ పర్యటకులతో కిటకిటలాడే గోవా పనాజీ బీచ్​లో కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు.

11:57 March 22

మరో 10 మందికి...

మహారాష్ట్రలో మరో 10 మందికి కరోనా సోకింది. ముంబయిలో ఆరు, పుణేలో కొత్తగా మరో 4 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

11:32 March 22

దిల్లీ వీధులు...

దిల్లీలోని కనాంట్​ ప్రాంతంలోని వీధులు అన్నీ ఖాళీగా ఉన్నాయి. దుకాణాలన్నీ మూసివేశారు. ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు.

11:23 March 22

మహారాష్ట్రలో...

మహారాష్ట్ర ముంబయిలోని జుహూ బీచ్ ప్రాంతం జనాలు లేక ఖాళీగా కనిపిస్తోంది. ప్రజలందరూ కరోనా వైరస్​ కారణంగా స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు.​

11:20 March 22

బీచ్​లు ఖాళీ...

కేరళ తిరువనంతపురంలో జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు ప్రజలు. నగరంలోని ప్రధాన బీచ్​లు అన్నీ నిర్మానుష్యంగా మారాయి.

11:13 March 22

ఐదుకు చేరిన మృతులు...

భారత్​లో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5కు చేరింది. మహారాష్ట్రలో 63 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు విడిచారు. ఫలితంగా దేశంలో మొత్తం మృతుల సంఖ్య 5కు చేరింది. అటు... కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 324కు చేరిందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 23 మంది బాధితులు కొవిడ్- 19 నుంచి కోలుకున్నట్లు పేర్కొంది.

11:10 March 22

రైళ్లు రద్దు...

హిమాచల్​ప్రదేశ్​లో కాల్కా- సిమ్లా వైపు వెళ్లే రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. 

10:47 March 22

బోసిపోయిన రోడ్లు...

జమ్ముకశ్మీర్​ శ్రీనగర్​లో పౌరులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. 

10:43 March 22

ఉత్తరాఖండ్​లో నిర్బంధం...

ఉత్తరాఖండ్​ దేహ్రాదూన్​లో ప్రజలందరూ స్వీయ నిర్బంధంలో ఉన్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి.

10:41 March 22

ఖాళీ వీధులు...

త్రిపుర అగర్తలాలో వీధులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

10:25 March 22

324కు చేరిన కరోనా కేసులు...

దేశంలో కరోనా కేసులు 324కు చేరినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.

10:12 March 22

పువ్వుల పంపిణీ...

దిల్లీలో ప్రజలకు పువ్వులిచ్చి బయటకు రావొద్దని పోలీసులు కోరుతున్నారు. జనతా కర్ఫ్యూను పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

10:11 March 22

పోలీసుల పహారా...

జమ్ముకశ్మీర్​ దోడా ప్రాంతంలో ప్రజలు జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. జనాలు బయటకు రాకుండా ఉండేందుకు పోలీసులు పహారా కాస్తున్నారు.

10:08 March 22

రాంచీ రైల్వేస్టేషన్​ ఖాళీ...

రాంచీలో రైల్వేస్టేషన్​ ప్రయాణికులు లేక బోసిపోయింది. మొత్తం పాసింజర్​, ఇంటర్​సిటీ రైళ్లను రద్దు చేశారు.

10:06 March 22

కర్ణాటకలోనూ అంతే...

కర్ణాటక బెంగళూరులోని మేజిస్టిక్​ బస్​స్టేషన్​ వద్ద మొత్తమంతా నిర్మానుష్యంగా ఉంది.​

09:30 March 22

కోలకతా బంద్​...

బంగాల్​ రాజధాని కోల్​కతాలోనూ ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.

09:29 March 22

దేశమంతా జనతా కర్ఫ్యూ

రోడ్లన్నీ ఖాళీ...

పంజాబ్​ లుధియానాలో జనతా కర్ఫ్యూ వల్ల ఉదయం 7 గంటల నుంచి రహదారులన్నీ ప్రశాంతంగా ఉన్నాయి.

09:26 March 22

తమిళనాడు నిశ్శబ్దం...

తమిళనాడు చెన్నైలో జనతా కర్ఫ్యూను ప్రజలందరూ పాటిస్తున్నారు. రహదారులన్నీ బోసిపోయాయి. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 315 కరోనా కేసులు నమోదయ్యాయి.

07:35 March 22

'జనతా కర్ఫ్యూ'తో  కరోనాపై భారత్​ యుద్ధం

జనతా కర్ఫ్యూ... ప్రపంచంపై పంజా విసురుతోన్న కరోనాపై భారత్​ ప్రకటించిన యుద్ధం. 14 గంటలపాటు దేశమంతా కర్ఫ్యూ పాటించి.. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ప్రధాని ఇచ్చిన పిలుపును ప్రజలు స్వాగతించారు.

ఉదయం నుంచే దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్​కతా, హైదరాబాద్​ సహా పలు ప్రధాన నగరాలన్నీ నిర్మానుష్యంగా మారాయి.  ఇందుకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థ, మార్కెట్లు, రోడ్లు, ఆలయాలు, దుకాణాలు, మైదానాలు.. ఇలా అన్ని మూసివేశారు. ఎటు చూసినా అంతా నిశ్శబ్దమే. అత్యవసర వస్తువుల విక్రయాలు మాత్రం జరుగుతున్నాయి. 

కరోనాపై ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయి.

ఈ రోజు ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు 14 గంటలసేపు ప్రజలంతా తమతమ ఇళ్లలోనే స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం పాటించాలని ప్రధాని పిలుపునిచ్చారు. సామాజిక దూరం పాటించడం ద్వారా ప్రాణాంతక కరోనా వైరస్‌కు కళ్లెం వేయాలని దేశ ప్రజలకు దిశానిర్దేశం చేశారు.

07:19 March 22

నాగ్​పుర్​ బంద్​

దేశంలో అత్యధిక కేసులు నమోదైన మహారాష్ట్రలో బంద్​ వాతావరణం కనిపిస్తోంది. నాగ్​పుర్​లోని ప్రధాన రహదారులతో పాటు వీధులన్నీ నిర్మానుశ్యంగా మారాయి. 

07:16 March 22

నిర్మానుశ్యంగా గువహటి వీధులు

జనతా కర్ఫ్యూలో భాగంగా అసోం ప్రధాన నగరం గువహటిలో వీధులన్నీ నిర్మానుశ్యంగా మారాయి. రాష్ట్రంలో తాజాగా కరోనా నిర్ధరణ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. 

06:54 March 22

ఇంట్లో ఉండండి.. ఆరోగ్యంగా ఉండండి: మోదీ

మరికొద్ది నిమిషాల్లో ప్రారంభమయ్యే జనతా కర్ఫ్యూలో ప్రజలందరూ పాల్గొని మన బలాన్ని చూపాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. కరోనా భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. మనం ఇప్పుడు తీసుకునే చర్యలు ముందుముందు ఉపయోగపడుతాయన్నారు.  

ఇంట్లో ఉండండి.. ఆరోగ్యంగా ఉండండి అంటూ ట్వీట్​ చేశారు. 

06:49 March 22

ఇంట్లోనే ఉందాం.. ఇలా గడిపేద్దాం

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో ప్రధాని మోదీ ‘జనతా కర్ఫ్యూ’కి పిలుపునిచ్చారు. ఈ ఆదివారం ప్రజలంతా 14 గంటలపాటు బయటకు రాకుండా ఉండాలని కోరారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వాలని ముఖ్యమంత్రులు, అధికారులూ స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి ఒక్కరోజే కాదు... కరోనా నేపథ్యంలో రానున్న కొన్నిరోజులు, వారాలపాటు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాల్సి రావచ్చు. అనుకోకుండా దొరికిన ఈ అవకాశాన్ని ఆరోగ్యకరంగా , ఆనందకరంగా మలచుకుందాం. మరి అందుకోసం ఏమేం  చేయవచ్చు...

అవగాహన పెంచుదాం

కరోనా, దాని వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కుటుంబసభ్యుల్లో అవగాహన కల్పించొచ్చు.

వ్యాయామం

రోజూ చేసే సమయంకంటే కొద్ది ఎక్కువ సమయం వ్యాయామానికి కేటాయించొచ్చు. యోగా చేేసే వారు ఏదైనా కొత్త ఆసనాన్ని ప్రారంభించొచ్చు.

కలివిడిగా వంట

ఇంట్లో ప్రతిరోజూ వంటతో ఆడవారే అలసిపోతుంటారు. మీరు వారికి సాయం చేయొచ్చు. ముఖ్యంగా ఉద్యోగినులు, ఇంటిపనులతో సతమతమయ్యే గృహిణులు... కొన్ని పనులను కుటుంబ సభ్యులకు అప్పగించి కొన్ని గంటలపాటైనా హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. కంటినిండా నిద్రపోవచ్చు.

పుస్తకంలోకి తొంగిచూద్దాం

ఉరుకులు పరుగుల జీవితాల్లో పుస్తకాలు చదడం కష్టమవుతోంది. ఓ మంచి పుస్తకాన్ని మనసారా ఓపట్టు పట్టొచ్చు.

శుభ్రం చేద్దాం

పిల్లలకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను నొక్కిచెప్పే పని పెట్టుకుందాం. ఎప్పటినుంచో పెండింగులో పెట్టిన శుభ్రత కార్యక్రమాలన్నింటినీ ఇంటిల్లిపాదీ కలిసి చేయొచ్చు. రోజూ వాడుకునే స్నానపుగదులు మురికిగా మారి ఉండొచ్చు. పిల్లలతో కలిసి వాటిని కడిగేయండి.

హాబీలను ఆస్వాదిద్దాం

పిల్లలతో బొమ్మలు గీయిద్దాం. మనమూ కుంచెను తీసుకుని రంగులద్దొచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఏవైనా హుషారెత్తించే పాటలకు నృత్యం చేయొచ్చు.మనసుకు ఆహ్లాదం కలిగించే, శ్రావ్యమైన పాటలను ప్రశాంతంగా ఆస్వాదిస్తూ, ఇష్టమైతే పాడుకోనూవచ్చు.

పత్రికను ఆసాంతం చదువుదాం

తీరిక దొరకని కారణంగా వార్తా పత్రికలోని శీర్షికలు చదవడానికే పరిమితమయ్యే వారు ఈరోజు ఆసాంతం చదవొచ్చు. పత్రికల్లో కరోనా గురించి అవగాహన పెంచుకునేలా ఎన్నో శాస్త్రీయమైన, ప్రామాణికమైన అంశాలు ఇస్తున్నారు. వాటిని చదివి అవగాహన పెంచుకోవచ్చు.

లేఖలు రాద్దాం

పిల్లలూ... మీరు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, పెద్దమ్మ, పెదనాన్నలతో తరచూ ఫోన్‌లో మాట్లాడుతుంటారు కదా. ఈరోజు సరదాగా ఒక ఉత్తరం రాయొచ్చు. దినపత్రికలకూ ఉత్తరాలు రాయొచ్చు.

ప్లాస్టిక్‌ను ఏరేద్దాం

రకరకాల మార్గాల్లో మనింట్లోకి వచ్చి చేరిన ప్లాస్టిక్‌ కవర్లు, సీసాలు, డబ్బాలు ప్రతి మూలకు చేరుతున్నాయి. వాటిని ఎవరు ఎక్కువ ఏరివేస్తే వారికి బహుమతులు ఇస్తామంటూ పిల్లల మధ్య పోటీ పెట్టొచ్చు.

తెలుగు నేర్పిద్దాం

ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న పిల్లలు తెలుగును మరచిపోతున్నారు. వారితో తెలుగులో ఉన్న చిన్నచిన్న కథలు, కవితల పుస్తకాలను ఆసక్తికరంగా, ఉత్సాహంగా చదివించొచ్చు.

ఆడుదాం అష్టాచెమ్మ

ఇంట్లోనే ఆడుకోవడానికి అనువైన సంప్రదాయ ఆటలైన అష్టాచెమ్మ, వైకుంఠపాళీ, పులి-మేక, వామనగుండ్లు(ఒనగండ్లు), చెస్‌, క్యారమ్స్‌ లాంటి వాటిని పిల్లలతో కలిసి ఆడొచ్చు.

ప్రకృతి సేవ

ఇంటి పెరడు, అపార్టుమెంట్ల ఆవరణల్లో మొక్కలకు పిల్లలతో నీళ్లు పోయించవచ్చు. పాదులను శుభ్రం చేయించవచ్చు. కొత్త మొక్కలనూ నాటొచ్చు.

క్యాండిల్‌ వెలుగులో విందు

ప్రజలంతా ఇళ్లలోనే ఉన్నారు. విద్యుత్తును తెగ వాడేస్తారు. సరఫరాపై తీవ్ర ఒత్తిడి పెరగొచ్చు. రాత్రి భోజనాన్ని ఆహ్లదంగా క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌గా మార్చుకుంటే కొత్త అనుభూతిని పొందొచ్చు. విద్యుత్తునూ ఆదా చేయొచ్చు.అలసి సొలసి హాయిగా నిద్రలోకి జారుకోవచ్చు. తెల్లవారుజామున గతంలో ఎన్నడూ లేనంత ఉల్లాసంగా మేల్కొనవచ్చు.

06:40 March 22

ఏడారిని తలపిస్తున్న ముంబయి ఎల్​టీటీ

జనతా కర్ఫ్యూ సందర్భంగా నిత్యం రద్దీగా ఉండే ముంబయి లోకమాన్య తిలక్ టర్మినల్​ ఎడారిని తలపిస్తోంది. ఇక్కడి నుంచి బయలుదేరే అన్ని పాసింజర్​, ఇంటర్​సిటీ రైళ్లను రాత్రి 10 గంటల వరకు అధికారులు రద్దు చేశారు. 

06:34 March 22

జనతా కర్ఫ్యూ అంటే ఏమిటి? ఎందుకు?

కరోనా నియంత్రణకై భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు యావద్దేశం జనతా కర్ఫ్యూ పాటించనుంది. భారత ప్రజానీకమంతా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు ఇళ్లకే పరిమితం కానుంది. ఈ నేపథ్యంలో జనతా కర్ఫ్యూ అంటే ఏమిటి? దీనిద్వారా ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోంది.? అనే అంశాలపై ప్రత్యేక వివరణ.

జనతా కర్ఫ్యూ అంటే ఏమిటి?

ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకపోవడమే జనతా కర్ఫ్యూ. కరోనా వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు యావద్దేశం పాటిస్తోంది. అత్యవసరమైతే తప్ప.. ఇళ్లనుంచి బయటకు కదలకూడదని మోదీ దేశ ప్రజలకు సూచించారు.

కర్ఫ్యూ లక్ష్యమేంటి?

సామాజిక దూరం పాటించడమే జనతా కర్ఫ్యూ లక్ష్యం. దీని ద్వారా వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉంటుంది. కరోనా వైరస్ ఎంత తీవ్రమైనదనే అంశంపై ప్రజలకు అవగాహన కలుగుతుంది.

ప్రజలు పాటించాల్సిన అంశాలు?

ఉదయం నుంచి రాత్రి వరకు బయటకు రాకూడదు. అత్యవసరమైతే తప్ప బయట తిరగకూడదు. వీధి అమ్మకాలు మొదలుకొని వాణిజ్య కార్యకలాపాలు నిలిపేయాలి. ప్రజలు.. బంధుమిత్రులను కలవడం వంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దు. ప్రజా రవాణా, ప్రైవేటు వాహనాలను నిలిపేయాలి.

చప్పట్లు ఎందుకు?

బాధితుడితో వ్యక్తిగతంగా సన్నిహితంగా మెలగడం, అతడు ఉపయోగించిన వస్తువులను తాకడం ద్వారా కరోనా సోకుతుంది. ఈ నేపథ్యంలో తమకు వైరస్ సోకే అవకాశాలున్నప్పటికీ వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా రంగ ప్రతినిధులు, పోలీసులు, డ్రైవర్లు, రైల్వే, బస్సు, ఆటోరిక్షా కార్మికులు, డెలివరీ బాయ్స్ వీరందరూ దేశ ప్రజలకోసం శ్రమిస్తున్నారు. వీరందరి కృషికి కృతజ్ఞతగా సాయంత్రం 5 గంటలకు.. 5 నిమిషాలపాటు దేశ ప్రజలు చప్పట్లు కొట్టాలి. గంటలు మోగించాలి.

కర్ఫ్యూతో వైరస్​ పోతుందా?

జనతా కర్ఫ్యూ అనంతరం వైరస్​ పూర్తిగా అంతమవుతుందని కాదు. కర్ఫ్యూ ముగిసిన అనంతరమూ ప్రమాదం కొనసాగుతూనే ఉంటుంది. వైరస్ నుంచి రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. సామాజిక దూరం పాటించాలి. ప్రభుత్వ మార్గదర్శకాలను నిజ జీవితంలో అమలు చేయాలి. జ్వరం, జలుబు, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలుంటే మాస్కులు ధరిస్తూ.. ఇతరులను కలవడాన్ని నియంత్రించాలి. వైద్యులను సంప్రదించాలి.

05:59 March 22

సుదీర్ఘ యుద్ధంలో ఇది విజయానికి నాంది: మోదీ

కరోనా వ్యాప్తిని కట్టడి కోసం ఇళ్లలోనే ఉండిపోవాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు యావత్ భారతం జనతా కర్ఫ్యూకు సిద్ధమయింది. కర్ఫ్యూలో భాగంగా వివిద కేంద్ర ప్రభుత్వ విభాగాలు అన్ని చర్యలూ తీసుకున్నాయి. 

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అత్యవసర సేవలు మినహా దుకాణాలు, షాపింగ్‌మాళ్లు, థియేటర్లు ఉదయం 7 నుంచి సాయంత్రం 9 వరకు షట్‌డౌన్‌లోనే ఉండనున్నాయి. కొన్ని రాష్ట్రాలు కొద్ది రోజుల పాటు పూర్తిస్థాయి లేదా పాక్షిక లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. 

అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ విభాగాలు జనతా కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. రైల్వే శాఖ గత అర్ధరాత్రి నుంచి ఇవాళ రాత్రి 10గంటల మధ్య అనేక రైళ్లు నిలిచిపోగా.. మరికొన్ని పరిమితంగా నడుస్తున్నాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ  రాత్రి 10 గంటల మధ్య నడిచే అన్ని మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌రైళ్లు, ఇంటర్ సిటీ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని రైళ్లు గమ్యస్థానం చేరిన తర్వాత నిలిచిపోనున్నాయి.

దాదాపు 3 వేల రైళ్లు ఆగిపోయాయి. దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, సికింద్రాబాద్‌ సబర్బన్‌ రైళ్లు చాలా పరిమితంగా నడుస్తున్నాయి. ముంబయి సబర్బన్ రైళ్లను పూర్తిగా నిలిపేశారు. రైల్వే స్టేషన్లలోని ఫుడ్‌ప్లాజాలు, రిఫ్రెష్‌మెంట్‌ రూములు, జన ఆహార్‌, సెల్‌కిచెన్లు మూతపడ్డాయి.

దేశీయ విమానయాన సంస్థలు పరిమితంగా నడుస్తున్నాయి. జనతా కర్ఫ్యూలో భాగంగా హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, రాజస్థాన్‌లో బస్సు సర్వీసులు నిలిపేస్తున్నారు. దేశ రాజధాని దిల్లీలో 50శాతం మాత్రమే నడుస్తున్నాయి. ముంబయి, హైదరాబాద్‌లలో మెట్రో రైలు సేవలు రద్దయ్యాయి.

అన్ని రాష్ట్రాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్బులు, బార్‌లు సాయంత్రం 9 వరకు షట్‌డౌన్‌లో ఉండనున్నాయి. అత్యవసర సేవలు మినహా ఇక ఏ దుకాణమూ తెరుచుకోవడం లేదు. 

రాష్ట్రాల వారీగా..

  • ఒడిశాలోని 5 జిల్లాలు, 8 పట్టణాల్లో వారం పాటు పూర్తిగా బంద్‌ 
  • రాజస్థాన్‌లో అత్యవసర సేవలు మినహా పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ 
  • పంజాబ్‌లోని నాలుగు జిల్లాల్లో మూడు రోజుల పాటు షట్​డౌన్​
  • బిహార్‌లో ఇవాళ పూర్తి బంద్‌ కొనసాగనుండగా రేపటి నుంచి 31 వరకు పాక్షిక బంద్‌
  • గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, సూరత్‌, వడోదర, రాజ్‌కోట్‌లో అత్యవసర దుకాణాలు మినహా మిగిలినవన్నీ బుధవారం వరకు మూసివేత
  • గోవాలో అన్ని చర్చిల్లో నేడు సామూహిక ప్రార్ధనలు రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ఆర్చి బిషప్‌ ప్రకటన 
  • దిల్లీ చర్చిల్లోనూ సామూహిక ప్రార్థనలు రద్దు 
  • కశ్మీర్‌లోని తమపరిధిలో ఉన్న మసీదుల్లో ఇవాళ ప్రార్థనలు నిలిపేయాలని కశ్మీర్ వక్ఫ్ బోర్డు సూచన
  • దేశవ్యాప్తంగా జైళ్లలోని ఖైదీలను వారి బంధువులతో ములాఖత్​లు రద్దు

చప్పట్లతో సంఘీభావం... 

దేశవ్యాప్తంగా కరోనా బాధితులకు అవిశ్రాంతంగా సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి సంఘీభావంగా సాయంత్రం 5 గంటలకు దేశప్రజలు చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలపాలని ప్రధాని మోదీ సూచించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని అగ్నిమాపకదళాలు, పోలీసులు, ఇతర అధికారులు వాళ్ల వాహనాల సైరన్‌లు లేదా బెల్లులు మోగించి వైద్యులకు కృతజ్ఞతలు చెప్పేలా ఆదేశించాలని ఇప్పటికే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు సూచనలు చేశారు. 

జనతాకర్ఫ్యూకి అందరూ మద్దతు తెలిపాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సహా పలువురు సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు దేశ ప్రజలకు సూచించారు.

Last Updated : Mar 22, 2020, 8:46 PM IST

ABOUT THE AUTHOR

...view details