నిర్బంధంలో ఉన్న తన తల్లికి చపాతీలో లేఖలు పెట్టి పంపించినట్లు జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ తెలిపారు. గత ఆరు నెలలుగా మాజీ ముఖ్యమంత్రులు ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన తల్లితో మాట్లాడేందుకు వీలు లేకపోవడం వల్ల చపాతీలో లేఖలు పెట్టి పంపించానని.. వాటి ద్వారానే తాము మాట్లాడుకున్నామని ఇల్తిజా తెలిపారు.
కశ్మీర్‌లోని ప్రజలు తమ ప్రాథమిక హక్కులు కోల్పోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మానసికంగా, ఆర్థికంగా ఎన్నో కష్టాలను వాళ్లు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఫ్తీపై కఠినమైన ప్రజా భద్రత చట్టం కింద కేసు నమోదు చేసే కొన్ని గంటల ముందు ఇల్తిజా ట్విట్టర్‌లో ఓ లేఖను పోస్టు చేశారు.
"నా తల్లిని అరెస్టు చేసి తీసుకెళ్లిన రోజును నేను ఎప్పటికీ మరువలేను. నేను తీవ్ర ఆందోళనకు లోనయ్యాను. కానీ ఒక రోజు మా అమ్మకు ఇంటి నుంచి పంపించిన టిఫిన్ బాక్స్‌లో ఓ లేఖ కనిపించింది. మా అమ్మ నాకు ఉత్తరం రాసి అందులో పెట్టి పంపించింది. నేను మాట్లాడేందుకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించలేను. లవ్ యూ, మిస్ యూ అని అందులో రాసి ఉంది. ఆ తర్వాత దానికి ఎలా జవాబు పంపించాలో నాకు అర్థం కాలేదు. అందుకు మా బామ్మ ఓ ఐడియా ఇచ్చింది. ఓ చిన్న పేపరులో రాసి దాన్ని జాగ్రత్తగా చపాతీ రోల్‌లో మడిచి పెట్టి పంపించాను"