ఉద్రిక్త వాతావరణం.. అమర్నాథ్ యాత్రికుల తిరుగు ప్రయాణం.. భారీగా బలగాల మోహరింపు.. ప్రజల గుండెల్లో గుబులు.. ఇదీ జమ్ముకశ్మీర్లో ప్రస్తుత పరిస్థితి.
వారం రోజుల్లో కశ్మీర్లో పరిస్థితులు మారిపోయాయి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న కశ్మీర్ లోయ ఒక్కసారి ఉలిక్కిపడింది. ఒకవైపు ఉగ్రముప్పు పొంచి ఉందన్న వార్తలతో అమర్నాథ్ యాత్రికులను వెళ్లిపొమ్మని ప్రభుత్వం హెచ్చరిచ్చింది. మరోవైపు రాష్ట్రంలో భారీ సంఖ్యలో భద్రతా దళాల మోహరింపు స్థానికులను కలవరపెడుతోంది.
ఈ ప్రభావం జమ్ముకశ్మీర్ పర్యాటక రంగంపై పడింది. నిత్యం సందర్శకులతో రద్దీగా ఉండే ఎన్నో అందమైన ప్రదేశాలు... తాజా పరిస్థితులతో వెలవెలబోతున్నాయి. రోడ్లు, ఉద్యానవనాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. చిరు వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారు.