యోగా గురువు రామ్‌దేవ్ బాబాపై రాజస్థాన్ జైపూర్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయుష్ మంత్రిత్వశాఖ అనుమతి పొందకుండా 'కరోనిల్' పేరుతో ఓ ఔషధాన్ని ఆవిష్కరించడమే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు.
కరోనాను నయం చేసే ఔషధమంటూ రామ్‌దేవ్ బాబా నేతృత్వంలోని పతంజలి సంస్థ 'కరోనిల్'ని మార్కెట్లోకి విడుదల చేసింది. దీనికి ఆయుష్ మంత్రిత్వశాఖ అనుమతి లేదు. అందుకే పతంజలి ఎండీ రామ్‌దేవ్ బాబాతో పాటు ఆయుర్వేద ఆచార్య బాలకృష్ణ; జైపూర్ నిమ్స్ డైరెక్టర్ బీఎస్ తోమర్, అతని కుమారుడు అనురాగ్ తోమర్, సీనియర్ శాస్త్రవేత్త అనురాగ్ వర్షిణీలపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఏడు రోజుల్లోనే..!
మానవాళిని పట్టిపీడిస్తున్న కరోనా వ్యాధిని కేవలం ఏడు రోజుల్లోనే కరోనిల్ నయంచేస్తుందని.. హరిద్వార్ కేంద్రంగా పనిచేస్తున్న పతంజలి సంస్థ పేర్కొంది. జైపూర్‌కు చెందిన ప్రైవేటు సంస్థ నిమ్స్ సహకారంతో ఈ ఔషధాన్ని రూపొందించినట్లు వెల్లడించింది.