జమ్ము కశ్మీర్ కుల్గాంలో ఉగ్రమూకను తరిమికొట్టారు సైనికులు. గత రాత్రి నుంచి ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం ఏడుగురు ముష్కరులు హతమయ్యారు. ఓ సైనికాధికారికి గాయాలయ్యాయి.
లోయర్ముందా...
కుల్గాంలోని లోయర్ ముందా ప్రాంతంలో ఇవాళ ఉదయం నుంచి హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టగా.. ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన ఎన్కౌంటర్కు దారి తీయగా.. ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది సైన్యం.
సీఆర్పీఎఫ్, జమ్ము కశ్మీర్ పోలీసు విభాగం, రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఘటనా స్థలం నుంచి ఒకరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన అధికారులు.. సోదాలు కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు.
అక్కడ నలుగురు...
భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్ము కశ్మీర్ కుల్గాం జిల్లా దేవసర్లోని గుడ్డేర్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది.
భద్రతా సిబ్బంది గస్తీకాస్తుండగా.. ముష్కరులు కాల్పులకు తెగబడ్డారని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఒక సైనికాధికారికి కూడా గాయాలయ్యాయని వెల్లడించారు.