భాజపా మినహా దేశంలో చాలా వరకు కుటుంబ ఆధారిత రాజకీయ పార్టీలే ఉన్నాయని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. అలాంటి పార్టీల వల్ల కేవలం వారి కుటుంబాలు మాత్రమే బాగుపడతాయని.. పరోక్షంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శించారు.
ఉత్తరాఖండ్‌లో భాజపా కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో వర్చువల్‌గా హాజరై ఆయన ప్రసంగించారు.
"ఎప్పుడైనా ఒక పార్టీ కార్యాలయం నాయకుడి ఇంటి నుంచి నడుస్తుందంటే.. ఆ పార్టీ కేవలం ఆ వ్యక్తికి మాత్రమే సంబంధించినది అవుతుంది. ఇలాంటివి మనం ఇతర పార్టీల్లో చూస్తుంటాం. ఆ పార్టీల్లో వారి కుటుంబ సభ్యులే కీలక పాత్ర పోషిస్తుంటారు. కానీ భాజపా విషయానికొస్తే పార్టీయే మన కుటుంబం. ఇక్కడ కార్యకర్తలు గౌరవ మర్యాదలు లభిస్తాయి. కాంగ్రెస్ సహా ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ నాయకుడి కుమారులు, సోదరులు, తల్లులను రక్షించుకోవడం కోసమే పనిచేస్తుంటాయి."