తెలంగాణ

telangana

By

Published : Dec 11, 2019, 7:47 AM IST

ETV Bharat / bharat

'మైనార్టీ'లపై ఉపేక్ష.. 'పౌర బిల్లు' వివాదానికి కేంద్ర బిందువు..!

సమభావం సమన్యాయం భారత రాజ్యాంగ స్ఫూర్తి సారం. ఆ సమున్నత ఆదర్శానికి శరాఘాతంగా పౌరసత్వ సవరణ బిల్లు రూపొందిందన్న విపక్షాల అభ్యంతరాల్ని తోసిరాజని భారీ మెజారిటీతో లోక్‌సభ దాన్ని సమ్మతించడం, రాజ్యసభామోదమే తరువాయి కావడం- దేశవ్యాప్తంగా భిన్నవర్గాల్లో ఆందోళన పెంచుతోందన్నది నిర్ద్వంద్వం.

editorial
పౌరసత్వ సవరణ బిల్లు వివక్ష చూపడమే...!

పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్లలో మైనారిటీలుగా మతపర అణచివేత భరించలేక శరణార్థులుగా భారత్‌కు 2014 చివరినాటికి వలసవచ్చి కనీసం అయిదేళ్లుగా ఇక్కడ నివసిస్తున్నవారికి పౌరసత్వం ఇవ్వాలని తాజా బిల్లు ప్రతిపాదిస్తోంది. దీనికి దేశంలో అనేక వర్గాలు, కళా రచయితలు, రాజకీయనేతలు వంటి వారి నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పౌరసత్వ బిల్లు వెసులుబాటును హిందూ, సిక్కు, జైన్‌, పార్సీ, బౌద్ధ, క్రైస్తవ మతస్తులకే పరిమితం చేసి ముస్లిం శరణార్థులను పూర్తిగా ఉపేక్షించడమే వివాదానికి కేంద్ర బిందువు అవుతోంది.

నీరుగారుస్తోన్న అధికరణ నిర్దేశాలు

అక్రమ వలసదారులన్న పదానికి నిర్వచనాన్నే మార్చేస్తున్న బిల్లు రాజ్యాంగంలోని పద్నాలుగో అధికరణ నిర్దేశాల్ని నీరుగార్చేస్తోందని విపక్షాలతో పాటు పౌరసమాజమూ తీవ్రంగా నిరసిస్తోంది. మైనారిటీల పరిరక్షణపై ఏనాడో 1950లోనే భారత్‌ పాక్‌ ప్రధానమంత్రుల మధ్య ఒప్పందం కుదిరినా, దాన్ని మన్నించడంలో ఇస్లామాబాద్‌ ఢాకా విఫలం కాబట్టే- ఆ చారిత్రక తప్పిదాన్ని సరిచెయ్యడానికి ఈ సవరణ బిల్లు అవసరమైందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చెబుతున్నారు. పౌరసత్వ బిల్లు ముస్లిములకు వ్యతిరేకమన్న వాదనలో వీసమెత్తు వాస్తవం లేదని కేంద్రం చెబుతున్నా పాకిస్థాన్‌లో పీడనకు గురై వచ్చిన షియాలు, అహమ్మదీయ తెగల ప్రస్తావన ఎక్కడా లేనేలేదు.

శ్రీలంక నుంచి శరణార్థులుగా వచ్చిన తమిళుల పౌరసత్వం సంగతినీ బిల్లు పట్టించుకోనే లేదు. ఐక్యరాజ్య సమితి ఎంతో ఆందోళన చెందిన రోహింగ్యాల భవిష్యత్తు పైనా బిల్లు మూగనోము పట్టింది. పౌరపట్టిక ద్వారా అక్రమ వలసదారుల్ని ఏరేస్తారనుకొంటే, కొత్త చొరబాట్లకు లాకులెత్తేలా ఇప్పుడీ పితలాటకం ఏమిటంటూ ఈశాన్యం భగ్గుమంటోంది. మంచి చెయ్యడమే కాదు, మంచిగానూ చెయ్యాలన్న మహాత్ముడి మాటే మేలుబాటగా సాగితే, ఇన్ని వివాదాలకు ఆస్కారం ఎక్కడిది?

‘తూర్పు బెంగాల్‌(బంగ్లాదేశ్‌)లోని హిందువులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఇండియాపై ఉందన్న సంగతి విస్మరించరాదు. కేవలం మానవతా దృక్పథంతోనే కాదు, స్వలాభం కోసం కాకుండా భారతావని స్వాతంత్య్రానికి, మేధావికాసానికి తరాల తరబడి వారు చేసిన త్యాగాలు, పడిన అగచాట్ల దృష్ట్యా అది తప్పనిసరి’ అని శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ ఏడు దశాబ్దాల నాడే ప్రకటించారు. నాటి జనసంఘ్‌ సిద్ధాంతాల నుంచే ప్రాదుర్భవించిన కమలం పార్టీ పౌరసత్వ సవరణ అంశాన్ని తన ఎన్నికల ప్రణాళికల్లో ప్రస్తావిస్తూనే ఉంది. ప్రధాని మోదీ తొలి జమానాలోనే పౌరసత్వ సవరణ బిల్లును నెగ్గించడానికి చేసిన యత్నం కడనిమిషంలో విఫలమైనా, తదనుగుణంగా ముందస్తు ఏర్పాట్లను 2015 సెప్టెంబరు నాటికే భాజపా పూర్తిచేసింది.

కేంద్రం దృష్టి సారించాలి

ఆ మూడు దేశాల నుంచి ఆరు మతవర్గాలవారు అక్రమంగా వలసవచ్చి ఇండియాలో ఉంటున్నా వారిపై ఎలాంటి శిక్షాత్మక చర్యలూ చేపట్టకుండా పాస్‌పోర్ట్‌ నిబంధనల్ని, విదేశీయుల ఉత్తర్వుల్నీ కేంద్రం సవరించింది! పనిలో పనిగా సంయుక్త పార్లమెంటరీ సంఘం పరిశీలన నుంచి వచ్చిన పౌరసత్వ సవరణ బిల్లును ఈ ఏడాది జనవరిలో లోక్‌సభలో నెగ్గించినా, ఈశాన్యం రగిలిపోతుండటంతో రాజ్యసభామోదం పొందకుండా సార్వత్రిక ఎన్నికల రీత్యా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. 2014లో కంటే ఆరు సీట్లు అధికంగా ఈసారి కమలం పార్టీకి కట్టబెట్టిన ఈశాన్య రాష్ట్రాలూ- పౌరసత్వ సవరణ బిల్లు అమలుకు సంబంధించి పలు మినహాయింపులు పొందికూడా ఎందుకంతగా భయోద్వేగాలకు లోనవుతున్నాయో కేంద్ర ప్రభుత్వం తర్కించాలి. భారత్‌ ఔదార్యాన్ని అలుసుగా తీసుకొని శత్రుదేశాలు చొరబాటు కుట్రలు పన్నే ప్రమాదంపై నిఘా సంస్థలు రా, ఐబీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో- ముందస్తు జాగ్రత్తలపైనా కేంద్రం దృష్టి సారించాలి!

అక్రమవలసలు

అక్రమ వలసల ఉరవడి దేశాన్ని ఎంతగా అతలాకుతలం చేస్తుందో ఇండియాకు తెలియనిది కాదు. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లోకి చొచ్చుకుపోయిన బంగ్లాదేశీ అక్రమ వలసదారుల సంఖ్య రెండుకోట్లకు పైబడినట్లు రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. అక్రమ వలసదారుల్ని ఏరిపారేయడానికి ‘సుప్రీం’ చొరవతో అసోమ్‌లో చేపట్టిన పౌరపట్టిక రూపకల్పన క్రతువంతా ప్రహసనప్రాయంగా మారింది. రూ.1,600 కోట్ల భారీవ్యయంతో శ్రమదమాదులకోర్చి పౌరపట్టిక రూపొందించినా అనర్హులంతా నిక్షేపంగా చిట్టాలోకి ఎక్కి, అర్హులకు మొండిచెయ్యి చూపినట్లయిందని వాపోతున్న అక్కడి ప్రభుత్వం ఆ తతంగం మొత్తాన్నీ చాపచుట్టేయాలనుకొంటోంది.

అక్రమ వలసలకు చెల్లుకొట్టాల్సిందిపోయి, ఆరు మతాలకు చెందినవారికైనా పౌరసత్వం ఇస్తూపోతే, తమ సామాజిక జీవన చిత్రం ఛిద్రమయ్యే ప్రమాదం ఈశాన్య రాష్ట్రాల్ని భయపెడుతోంది. పౌరసత్వ సవరణ బిల్లుతో సంబంధం లేదంటూనే భారతీయులందరి వివరాలతో జాతీయ పౌరపట్టిక రూపొందిస్తామన్న కేంద్రం ప్రకటన- భిన్నత్వంలో ఏకత్వ కదంబమైన భారతావని ప్రజానీకంలో ప్రకంపనలకు కారణమవుతోంది. రాజ్యాంగ స్ఫూర్తికి సొడ్డుకొట్టి, పౌరసత్వ సవరణ బిల్లులో ముస్లిములను మినహాయించిన కేంద్రం- పౌరపట్టిక రూపకల్పనలో సమన్యాయ భావనకు ఏ గతి పట్టిస్తుందోనన్న భయసందేహాలు ముమ్మరిస్తున్నాయి. పౌరసత్వ సవరణ బిల్లులో మతప్రాతిపదికన ఫలానా వర్గాన్ని మినహాయించడం రాజ్యాంగబద్ధం కాబోదని ‘సుప్రీం’ విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎం లోథా అభిప్రాయపడుతున్నారు. అభాగ్య వలసదారుల పట్ల మానవత్వంతో స్పందించాలనడం సరైనదే అయినా బంతిలో వలపక్షంపై న్యాయ మీమాంసలకు కమలనాథులు సమాధానం చెప్పకతప్పదు!

ఇదీ చూడండి : నేడు రాజ్యసభకు పౌరసత్వ బిల్లు- ఆమోదం లాంఛనమే!

ABOUT THE AUTHOR

...view details