భారతదేశం 71వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొన్న సందర్భంగా రాజ్యాంగం మహిళలు, బాలలకు ప్రసాదించిన హక్కులను మనమెంత సమర్థంగా అమలు చేస్తున్నామో సింహావలోకనం చేసుకోవడం అవసరం. చట్టం ముందు అందరూ సమానులేనని, అందరికీ సమానంగా చట్టపరమైన రక్షణ లభిస్తుందని రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల అధ్యాయం భరోసా ఇచ్చింది. కుల, మత, జాతి, మత, లింగ, ప్రాంతీయపరంగా ఎవరిపైనా దుర్విచక్షణ చూపకూడదని నిషేధం విధించింది. మహిళలు, బాలల హక్కులు, సంక్షేమం కోసం ప్రభుత్వం ఏవైనా ప్రత్యేక చర్యలు తీసుకోదలిస్తే, ఆ పని నిక్షేపంగా చేయవచ్చునని 15 (3)వ రాజ్యాంగ అధికరణ ఉద్ఘాటించింది. మహిళలను ప్రధాన రాజకీయ స్రవంతిలోకి తీసుకురావడం, బాలల హక్కులను సంరక్షించడం జాతి బాధ్యత అని రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు. మరి వారి దార్శనికతను మనమెంతవరకు నెరవేర్చగలిగామన్నది 71వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అనుశీలించడం సందర్భోచితంగా ఉంటుంది.
గణతంత్ర గమనం.. ఒడుదొడుకులమయం
మహిళా సమానత్వం, మహిళా హక్కుల గురించి రాజ్యాంగ నిర్మాతలకు మొదటి నుంచి పూర్తి అవగాహన ఉంది. వాటిని తప్పనిసరిగా అమలు చేయాలన్న దృఢసంకల్పమూ ఉంది. ఆరంభంలో కొన్ని ఒడుదొడుకులు ఎదురైనా, 1950లలో హిందూస్మృతి బిల్లుల ఆమోదంతో ముందడుగు పడింది. అయితే హక్కుల సంరక్షణా రథం జోరు అందుకోవడానికి మరికొంత సమయం పట్టింది. 1961లో మాతృత్వ సంక్షేమ చట్టం, వరకట్న నిషేధ చట్టాలు ఆమోదం పొందాయి. కేవలం చట్టాలతోనే సమూల మార్పు సాధించలేమని అనుభవంలో తెలిసివస్తోంది. ఉదాహరణకు భారతీయ శిక్షాస్మృతిలోని 304 బి సెక్షన్ వరకట్న మరణాలను హేయమైన నేరంగా పరిగణిస్తోంది. అంతమాత్రాన వరకట్నం కోసం వేధించడం, కోడళ్ల హత్యలు, ఆత్మహత్యలు ఆగలేదు కదా! నేడు దేశంలో గంటకొక వరకట్న మరణం సంభవిస్తోందని జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించడం ఓ భీకర వాస్తవాన్ని కళ్లకు కడుతోంది. ఆచరణలో కొన్ని లోటుపాట్లున్నా మహిళలకు చట్టపరమైన రక్షణను కొనసాగించడం తప్పనిసరి. అందుకే గృహహింస నిరోధానికి ఒక చట్టం చేశాం. పని చేసేచోట మహిళలను లైంగికంగా వేధించడం నిషిద్ధమని, అసలు అలాంటివి జరగకుండా ముందే నివారించాలని, లైంగిక వేధింపులు జరిగితే కఠినంగా శిక్షించాలని నిర్దేశిస్తూ ప్రత్యేక చట్టమూ చేశాం. ఎంతో కాలం చర్చలు, తర్జనభర్జనలు జరిగిన మీదట అవి రూపుదాల్చాయి. రాజ్యాంగం తమకు భరోసా ఇచ్చిన హక్కుల్లో కొన్నింటినైనా సాధించుకోవడానికి మహిళలకు అండగా నిలిచాయి. అయితే చట్టాలు ఆశించిన ఫలితాలు ఇచ్చేలా నిరంతరం జాగరూకత పాటించాలి.
మహిళలు, పురుషులనే భేదం లేకుండా పౌరులందరికీ సముచిత జీవనాధారం, ఒకే పనికి ఒకే విధమైన వేతనాలు అందాలని రాజ్యాంగంలో పొందుపరచిన ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాయి. పంచాయతీలు, పురపాలక సంఘాల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగలతోపాటు మహిళలకూ రాజ్యాంగం సీట్లు కేటాయించింది. అయితే కొన్ని సీట్లలో మహిళలకు బదులు వారి భర్తలు లేక బంధువులు అధికారం చలాయిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. కొందరు అగ్రశ్రేణి రాజకీయ నాయకులు సైతం మహిళలు ఉండాల్సింది వంటింట్లోనని, వారు బయటికొచ్చి గద్దెనెక్కడం సరికాదని వ్యాఖ్యానించడం చూస్తూనే ఉన్నాం. కాబట్టి కేవలం చట్టాలతోనే పని జరగదని అర్థమవుతోంది. అందరి మనస్తత్వాల్లో, దృక్పథాల్లో మార్పు రావాలి. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన విధంగా మహిళలకు సాధికారత చేకూర్చాలనే దృఢసంకల్పం అందరిలో పాదుకోవాలి. ప్రత్యేక సంరక్షణ, సహాయం పొందే హక్కు చిన్నారులకు ఉందని సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనలోని 25వ అధికరణ గుర్తించింది. 1948లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ఆమోదించిన ఈ ప్రకటనను ప్రపంచ దేశాలన్నీ శిరసావహిస్తున్నాయి. తదనుగుణంగా భారత రాజ్యాంగం బాలలతో చాకిరీ చేయించడాన్ని నిషేధించింది. 14 ఏళ్లలోపు పిల్లలతో కర్మాగారాల్లో కాని, గనుల్లో కాని, మరెక్కడైనా కాని ప్రమాదభరితమైన పని చేయించకూడదని స్పష్టీకరించింది. చిన్నారులు ఆరోగ్యవంతంగా ఎదిగేట్లు జాగ్రత్త తీసుకోవాలని రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు నిర్దేశిస్తున్నాయి. స్వేచ్ఛాయుత వాతావరణంలో హుందాగా పెరిగేలా పిల్లలకు అవకాశాలు, సౌకర్యాలు కల్పించాలన్నాయి. బాలలు, యువజనుల శ్రమను దోపిడి చేయడం, నైతికంగా, భౌతికంగా వారిని నిస్సహాయులుగా వదిలివేయడం వంటివి జరగరాదంటున్నాయి. ఈ లక్ష్యాలను సాధించడానికి తగు విధానాలు రూపొందించి అమలు చేయాలని ఆదేశిస్తున్నాయి. ఇవి గొప్ప లక్ష్యాలే కాని, వాటిని ఎంతవరకు నెరవేర్చామో తరచిచూసుకోవడం ఆవశ్యకం. పిల్లల హక్కులను నిజంగా కాపాడగలుగుతున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.