'పోటీ చేయకపోవటంపై స్పందించాల్సింది కేవలం అడ్వాణీనే. నాతో సహా మరెవ్వరూ దీని గురించి అభిప్రాయాలు చెప్పలేరు.'
- ఉమా భారతి, కేంద్ర మంత్రి
'ఎందుకు పోటీ చేయట్లేదో అడ్వాణీయే చెప్పాలి' - కేంద్రం
ఎల్కే. అడ్వాణీ.. ఈసారి భాజపా తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం చర్చనీయాంశమైంది. అయితే... తాజాగా ఇదే అంశంపై భాజపా సీనియర్ నాయకురాలు, కేంద్ర మంత్రి ఉమాభారతి స్పందించారు. ఈ విషయంపై స్పందించాల్సింది అడ్వాణీ మాత్రమేనని వ్యాఖ్యానించారు.
భాజపా కురువృద్దుడు అడ్వాణీ 1998 నుంచి గుజరాత్లోని గాంధీనగర్ స్థానం నుంచి గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ స్థానం నుంచి భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా కు టికెట్ కేటాయించింది. దీనిపై అడ్వాణీ నుంచి గానీ, అధిష్టానం నుంచి గానీ ఎలాంటి ప్రకటనా రాలేదు.
వయసు ఆధారంగా టికెట్లు కేటాయించకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు ఉమాభారతి. కొందరు యువ ఎంపీలకూ ఈసారి టికెట్ దక్కలేదని గుర్తుచేశారు. ఇటీవలే పార్టీ ఉపాధ్యక్షురాలిగా నియమితులైన ఉమా భారతి స్వయంగా ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. మరోసారి తిరుగులేని మెజారిటీతో మోదీనే ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు.
యువనేతల్ని ప్రోత్సహించే దిశగా ఆలోచిస్తుంది భాజపా. ఈ సారి లోక్సభ ఎన్నికల్లో సీనియర్లు శాంత కుమార్, బీసీ. ఖండూడీ, కరియా ముండా వంటి ప్రముఖులకు టికెట్ దక్కలేదు. ఇందులో కొంతమంది పోటీ చేయట్లేదని ప్రకటించారు. అయితే.. అడ్వాణీ అభ్యర్థిత్వం చర్చనీయాంశమైంది.