కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున దాన్ని నివారించేందుకు అనేక చర్యలు చేపట్టాయి ప్రభుత్వాలు. ఇందులో భాగంగా క్రిములు ఎక్కువగా ఉండేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో క్రిమి సంహారక మందులను పిచికారీ చేస్తున్నారు. కొన్నిచోట్ల వీటిని ప్రజలపైనా చల్లేస్తున్నారు. ఇలా చేయడం మంచిదేనా? లేక ప్రమాదకరమా? అసలీ రసాయనం వైరస్ నివారణకు ఉపయోగపడుతుందా? అనే విషయాలపై ఓ నివేదిక పలు విషయాలు వెల్లడించింది.
క్రిమి సంహారక మందులను వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ఇవి క్రిములను, వైరస్, బాక్టీరియాలను నాశనం చేసే శక్తి కలిగి ఉంటాయి. కానీ వీటిని శరీరంపై వేసుకోవడం వల్ల ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం క్రిమి సంహారక మందుగా సోడియం హైపోక్లోరైట్‌ను అధికంగా వినియోగిస్తున్నారు. వీటిని శరీరంపై పూసుకోవడం వల్ల లేనిపోని సమస్యలు తలెత్తుతాయి.
" క్రిమి సంహారక మందులను వ్యాధికారక లేదా ఇతర హానికరమైన సూక్ష్మజీవులను నాశనం చేసేందుకు ఉపయోగిస్తారు. వీటిని పిచికారీ చేయడం వల్ల హానికరమైన క్రిములు, వైరస్లు హతమవుతాయి. అందుకే కరోనా సోకిన వారు ఉండే ప్రాంతాలు, వారు తాకే వస్తువులు తదితర ప్రాంతాల్లో వీటిని అధికంగా వినియోగిస్తారు. అయితే వీటిని శరీరంపై వేయడం ఏమాత్రం మంచిది కాదు. ఇలాంటి వాటిని బహిరంగ ప్రదేశాల్లో వాడేటప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేతికి గ్లౌజ్‌లు ధరించాలి."
--- ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ