కర్ణాటకలో మళ్లీ రాజకీయ సంక్షోభంపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య బుధవారం వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో అన్ని సవ్యంగా లేవని కొంతమంది భాజపా ఎమ్మెల్యేలు తనతో చెప్పినట్లు సిద్ధరామయ్య వెల్లడించారు.
ఇప్పటికే భాజపాలోని ఓ వర్గం ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు నిర్వహించారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో సిద్ధరామయ్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
"ప్రభుత్వంలో చాలా విభేదాలు ఉన్నాయి. వాళ్ల ఎమ్మెల్యేలు కొంత మంది నన్ను కలిశారు. అంతేకాదు, భాజపా ప్రభుత్వం సవ్యంగా లేదని నాకు చెప్పారు. యడియూరప్ప కేవలం ముఖ్యమంత్రి పాత్ర వహిస్తున్నారు. ఆయన కుమారుడు విజయేంద్రనే ప్రభుత్వాన్ని చేతిలోకి తీసుకున్నారు. పనులు, ఆమోదాలు అన్నీ ఆయనే చూస్తున్నారు."
- సిద్ధరామయ్య, కాంగ్రెస్ ఎల్పీ నేత
రహస్య భేటీలు!
మంత్రి పదవులు ఆశిస్తున్న కొందరు సీనియర్ ఎమ్మెల్యేలతోపాటు రాజ్యసభ, శాసనమండలి సీట్లపై చాలా మంది భాజపా నేతలు అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది పార్టీలో అంతర్గతంగా విభేదాలను సృష్టించిందని చెబుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఉత్తర కర్ణాటకకు చెందిన వారు ఎమ్మెల్యే కత్తి ఉమేశ్ నివాసంలో గతవారం విందు కోసం కలుసుకోవటం ఈ వార్తలకు బలం చేకూర్చింది.
ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు.. యడియూరప్ప కుమారుడి వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పాలన వ్యవహారాల్లో విజయేంద్ర జోక్యం చేసుకుంటున్నట్లు ఆరోపించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ విజయేంద్రను 'రాజ్యాంగేతర ముఖ్యమంత్రి'గా అభివర్ణించారు సిద్ధరామయ్య.
"మేం భాజపా ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం దానంతట అదే పడిపోతుంది. మేం కేవలం ఎదురుచూస్తూ ఉంటాం."