ఫ్రాన్స్ నుంచి రఫేల్ విమానాలు భారత్‌కు వచ్చే క్రమంలో ఓ ఉత్కంఠ పరిణామం చోటు చేసుకొంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన రఫేల్ విమానాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అల్ దాఫ్రా విమానాశ్రయానికి చేరుకొన్నాయి. మంగళవారం రాత్రి విమానాలు అక్కడ ఉన్న సమయంలో ఎయిర్ బేస్‌పై క్షిపణి దాడి గురించి హెచ్చరించే అత్యవసర సైరన్ మోగింది. అదే సమయంలో ఖతార్‌లోని అమెరికా వైమానిక స్థావరమైన అల్ ఉదైద్‌లో కూడా అలారం మోగింది. దీంతో అక్కడి బలగాలు అప్రమత్తం అయ్యాయి.
ఇరాన్ ప్రయోగించిన కొన్ని క్షిపణులు అల్ దాఫ్రా ఎయిర్‌బేస్‌కు సమీపంలోని సముద్రజలాల్లో కూలిపోయాయి. ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ నిర్వహిస్తున్న యుద్ధ విన్యాసాల్లో భాగంగా వీటిని ప్రయోగించినట్లు తేలింది. ఈ విషయాన్ని సీఎన్‌ఎన్, ఫాక్స్ న్యూస్‌కు చెందిన ప్రతినిధులు తమ అధికారిక ట్విటర్ ఖాతాల్లో వెల్లడించారు.