'కరోనా యుద్ధం మధ్యలో ఉన్నాం. అది కూడా కనిపించీ కనిపించని శత్రువుతో యుద్ధం. కనిపించే శత్రువుతో పోరాడాలంటే ఆయుధాలు సరిపోతాయి. ఇది కంటికి కనిపించదు. అందుకే అలాంటి శత్రువుతో యుద్ధానికి డీఆర్‌డీఓ మేధస్సుతో సమాయత్తమవుతోంది' అని డీఆర్‌డీఓ ఛైర్మన్, రక్షణ మంత్రి సలహాదారు జి.సతీష్‌రెడ్డి చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో దాని నివారణకు డీఆర్‌డీఓ చేపడుతున్న చర్యలను 'ఈనాడు'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు.
కరోనా కట్టడిలో డీఆర్‌డీఓ పాత్ర ఏమిటి
వైరస్ కనిపించని శత్రువు. దాన్ని జయించేందుకు కీలకపాత్ర పోషిస్తున్నాం. పలు ఉత్పత్తులు మేధో మథనం స్థాయి దాటి కార్యరూపంలోకి తీసుకువచ్చే దశలో ఉన్నాయి. కొన్ని ఉత్పత్తి దశలో ఉన్నాయి.
మాస్కులు, శానిటైజర్లు, వెంటిలేటర్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి?
మాస్కులు, శానిటైజర్లు పూర్తి స్థాయిలో ఉత్పత్తి అవుతున్నాయి. తొలివిడతగా కొన్నింటిని తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తున్నాం. వెంటిలేటర్ల నమూనాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. తయారీ కోసం ప్రయివేటు సంస్థలకు ఇచ్చాం.
నూట్రీషియస్ ఫుడ్ తయారీలో డీఆర్‌డీఓకు అనుభవం ఉంది కదా? కరోనా బాధితుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
జరగరానిది ఏమైనా జరిగితే, ఆహారానికి కొరత రాకూడదనే వ్యూహంతో రెడీమేడ్ ఆహారాన్ని తయారు చేసి నిల్వ చేస్తున్నాం. ఆహార కొరతకు అవకాశం ఉండవచ్చని కొన్ని దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం చేసింది. ఆ దేశాల జాబితాలో భారతదేశం లేదు. అది వేరే విషయం.
ఎన్ని వెంటిలేటర్లు సిద్ధం చేస్తున్నారు.. ఎగుమతి ఆలోచనేమైనా ఉందా?