మానవ మేధస్సుకు పట్టం కట్టే మహోజ్జ్వల ఘట్టానికి తెరలేచింది. భారత రెండో మూన్ మిషన్ చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని శ్రీహరికోట సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో.
దాదాపు 3 వేల 850 కేజీల బరువున్న ఉపగ్రహంతో సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాలకు నింగికెగసింది జీఎస్ఎల్వీ మార్క్-3ఎం1 వాహకనౌక. బయలుదేరిన 16 నిమిషాల 13 సెకన్ల అనంతరం... చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని 170కి.మీ X 39,059 కి.మీ.ల భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టింది వాహకనౌక. 5 రోజుల తర్వాత భూ నియంత్రిత కక్ష్యలోకి ప్రవేశిస్తుంది.
ఇదీ చూడండి:చంద్రయాన్-2: విక్రమ్, ప్రగ్యాన్లే అసలు హీరోలు!
అవరోధాలను అధిగమించి...
రాకెట్లో సాంకేతిక సమస్యతో మొదట జులై 15న ప్రయోగం అర్ధంతరంగా ఆగిన అనంతరం.. నేడు మిషన్ విజయవంతంతో ఊపిరి పీల్చుకున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఉపగ్రహాన్ని భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టగానే.. షార్ అంతటా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. శాస్త్రవేత్తలంతా ఒకరికొకరు అభినందనలు చెప్పుకున్నారు.
ప్రయోగ విజయాన్ని ప్రకటించిన ఇస్రో ఛైర్మన్ కె. శివన్.. ఇది చంద్రునివైపు భారత చరిత్రాత్మక ప్రయాణానికి ఆరంభం మాత్రమేనని తెలిపారు. మార్క్-3 విజయం కొత్త ఉత్సాహాన్నిచ్చిందన్నారు. వచ్చే నెలన్నర కీలకమని.. సెప్టెంబర్ మొదటివారంలో ల్యాండర్ చంద్రుడిపై దిగిన తర్వాత యాత్ర పూర్తవుతుందన్నారు.
''భారత శాస్త్ర, సాంకేతిక రంగానికి ఈ రోజు చారిత్రకం. జీఎస్ఎల్వీ మార్క్-3 వాహకనౌక చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది.
అయితే.. చంద్రునిపై భారత చారిత్రక ప్రయాణానికి ఇది ఆరంభం మాత్రమే. ఇంకా.. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో దిగి.. విస్తృత సాంకేతిక పరిశోధనలు చేయనుంది. అయితే.. తీవ్రమైన సాంకేతిక సమస్యను గుర్తించాం. దానిని వెంటనే పరిష్కరించి.. ఇస్రో విజయవంతమైంది. వారం క్రితం సాంకేతిక సమస్యను గుర్తించి... పరిష్కరించేందుకు ఇస్రో బృందమంతా రంగంలోకి దిగింది. ఆ 24 గంటలూ అద్భుతంగా కష్టపడ్డారు.''
- కె. శివన్, ఇస్రో ఛైర్మన్