పరోటా అంటే మీకు చాలా ఇష్టమా.. రెండు మూడు ప్లేట్లయిన సులభంగా లాగించేస్తారా.. అయితే మీరు కచ్చితంగా హరియాణాలోని రోహ్తక్కు వెళ్లాల్సిందే. రుచికరమైన పరోటాలే కాదు.. ఓ హోటల్లో పెట్టిన పందెంలో పాల్గొని గెలిస్తే లక్ష రూపాయలు మీ సొంతం. ఆ విశేషాలు మీ కోసం.
రోహ్తక్లోని తపస్య హోటల్.. దేశంలోనే అతిపెద్ద పరోటాలకు పెట్టింది పేరు. జంబో పరోటాలు ఇక్కడే లభిస్తాయి. భోజన ప్రియులకు ఓ సవాల్ విసిరారు.. ఆ హోటల్ యజమాని. తమ హోటల్లో 50 నిమిషాల్లో 3 జంబో పరోటాలు తింటే లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటించాడు. అంతే కాదండోయ్.. జీవితాంతం భోజనం ఉచితం కూడా. హోటల్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం ఇద్దరే ఈ పందెం నెగ్గినట్లు యజమాని చెబుతున్నారు.
ఈ హోటల్లో 50 రకాల పరోటాలు.. మూడు సైజుల్లో(సాధారణ, మధ్యస్థ, జంబో) తయారు చేస్తారు. అందులో బంగాళదుంప, కాలీఫ్లవర్, ఉల్లిపాయ, ఆల్ మిక్స్ పరోటాలు ఉన్నాయి.
జంబో సైజులోని పరోటాలు రెండున్నర అడుగుల మేర ఉంటాయి. ఇందులో 2 కిలోల కుర్మా వేస్తారు. స్వచ్ఛమైన దేశీయ నెయ్యితో తయారు చేస్తారు. ఇక్కడ మీడియం పరోటా ధర రూ. 90, జంబో సైజు పరోటాలు రూ. 300లు ఆపైన ఉంటాయి. ఈ జంబో పరోటాలను ఐదుగురు తినొచ్చు.