కరోనా ధాటికి ఇబ్బందిపడుతున్న దేశాల్లో భారత్ ఒకటి. అయితే వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఎక్కువ సంఖ్యలో నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే వాటిల్లో పాజిటివ్ రేటు తక్కువగా ఉండటం శుభపరిణామం. రోజువారీ పరీక్షల్లో దాదాపు 8 శాతానికి దిగువనే బాధితుల సంఖ్య నమోదవుతోంది. ఆదివారం ఈ మేరకు వివరాలను వెల్లడించింది కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ.
దేశవ్యాప్తంగా టెస్టింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. జనవరి నాటికి కోటి టెస్టులు చేయగా.. అక్టోబర్ నాటికి ఆ సామర్థ్యం 9.32 కోట్లకు చేరింది. అధిక సంఖ్యలో టెస్టులు చేయడం వల్లే బాధితులను గుర్తించడం సహా ఐసోలేషన్ సేవలు, కరోనా చికిత్స అందించడం సులభం అవుతోందని తెలిపారు. కట్టుదిట్టమైన చర్యల వల్లే దేశంలో మరణాల రేటు కనిష్ఠంగా ఉందని వెల్లడించారు.