తెలంగాణ

telangana

By

Published : May 9, 2020, 6:52 PM IST

ETV Bharat / bharat

'జులైలో కరోనా కేసులు తీవ్రం-అయినా భయపడొద్దు'

కరోనా వైరస్​ను వేగవంతమైన చర్యలతో భారత్​ తక్కువ సంఖ్యకే పరిమితం చేయగలిగిందని మన దేశంలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) రాయబారి డేవిడ్‌ నబారో అన్నారు. అయితే జులైలో కొవిడ్-19 కేసులు గరిష్ఠ స్థాయికి చేరుతాయని ఆయన అంచనా వేశారు. లాక్​డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా కేసులు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదని.. క్రమంగా పరిస్థితులు అదుపులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

who on India about corona
కరోనా కట్టడిలో భారత్ భేష్​

భారత ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించి వేగవంతంగా చర్యలు తీసుకోవడం వల్ల కొవిడ్‌-19 కేసులను తక్కువ సంఖ్యకే పరిమితం చేయగలిగిందని మన దేశంలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) రాయబారి డేవిడ్‌ నబారో స్పష్టం చేశారు. అయితే, కేసుల సంఖ్య జులైలో గరిష్ఠ స్థాయి(పీక్‌)కి చేరుతుందని అంచనా వేశారు. అంతకంటే ముందు కొన్నిరోజుల పాటు కొత్త కేసుల సంఖ్య స్థిరంగా నమోదవుతాయని తెలిపారు. ప్రముఖ జాతీయ మీడియాతో ఈ విషయాలను వెల్లడించారు.

పెరిగినా..భయపడాల్సిన అవసరం లేదు

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కేసుల సంఖ్య కొంతకాలం పెరుగుతుందని.. అయినా భయడపడాల్సిన అవసరం లేదని నబారో స్పష్టం చేశారు. అక్కడక్కడ పెరిగినప్పటికీ.. క్రమంగా కట్టడిలోకి వస్తుందని తెలిపారు. లాక్‌డౌన్‌ సత్ఫలితాలిచ్చిందనీ.. దీనివల్ల వైరస్‌ను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయగలిగామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో తీవ్రత ఎక్కువగా ఉండడంపై నబారో ఆందోళన వ్యక్తం చేశారు.

భారత్‌లో కేసులు క్రమంగా పెరుగుతున్నప్పటికీ.. జనాభాతో పోలిస్తే ఇప్పటి వరకు నమోదైన కేసులు చాలా తక్కువేనని అభిప్రాయపడ్డారు. దేశంలో వృద్ధుల సంఖ్య తక్కువ ఉండడం వల్ల మరణాల రేటు కూడా చాలా తక్కువగా నమోదవుతుందని వివరించారు.

విమర్శించినా.. వెనక్కి తగ్గం..

డబ్ల్యూహెచ్‌ఓపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఆరోపణల్ని ఈ సందర్భంగా నబారో ప్రస్తావించారు. ఓ అధ్యక్షుడు లేదా ప్రధాన మంత్రి.. సంస్థ పనితీరుపై ఆరోపణలు గుప్పించడం వల్ల వైరస్‌పై చేస్తున్న పోరు ఆగిపోదని స్పష్టం చేశారు. చైనాకు సంస్థ అనుకూలంగా పనిచేస్తుందన్న ట్రంప్‌ విమర్శలు డబ్ల్యూహెచ్‌ఓ సాధారణ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని తెలిపారు. మహమ్మారిని కట్టడి చేసే లక్ష్యం నుంచి సంస్థ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

ఇదీ చూడండి:'కోయంబేడు' మార్కెట్​ వల్లే తమిళులకు కరోనా కీడు!

ABOUT THE AUTHOR

...view details