దేశంలో 1999-2019 మధ్యకాలంలో చిన్నారుల మరణాల రేటు గణనీయంగా తగ్గిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. కానీ గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లల మరణాల్లో మూడో వంతు భారత్, నైజీరియాలోనే సంభవించినట్లు ఓ నివేదికలో పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా ఐదు సంవత్సరాల లోపు చిన్నారులు మరణాల రేటు 2019లో రికార్డు స్థాయిలో పడిపోయిందని తెలిపింది ఐరాస. 1990లో కోటీ 25 లక్షల నుంచి 2019లో 52 లక్షలకు తగ్గిందని వెల్లడించింది. భారత్లో చిన్నారుల మరణాల రేటు 1000 మందిలో 126 నుంచి 2019 నాటికి 34కు తగ్గిందని లెక్కగట్టింది యూనిసెఫ్. తక్కువ బరువుతో జన్మించటం, పుట్టినప్పుడు వచ్చే సమస్యలు, నిమోనియా, డయేరియా, మలేరియా వంటి వాటిని నివారించటానికి గత 30 ఏళ్ల నుంచి ఆరోగ్య కార్యకర్తలు చేసిన కృషి వల్ల లక్షలాది మంది చిన్నారులు బతికినట్లు వెల్లడించింది.
గత ఏడాదిలో దేశ వ్యాప్తంగా 6,79,000 మంది మృతి చెందగా.. ఈ సంఖ్య 1990లో 24 లక్షలుగా ఉంది.
1990 -2019 మధ్య కాలంలో నవజాత శిశు మరణాల రేటు 57 నుంచి 22కి(ప్రతి 1000కి) పడిపోయింది. 1990లో 15 లక్షలుగా ఉన్న నవజాత శిశువుల మరణాలు.. 2019 నాటికి 5,22,000కు చేరుకున్నాయి.