ఓ అమెరికా సంస్థ నుంచి రెండు ప్రిడేటర్ డ్రోన్లను లీజుకు తీసుకుంది భారత నావికాదళం. ప్రస్తుతం వీటిని హిందూ మహా సముద్రంలో నిఘా కోసం వినియోగిస్తోంది. అయితే చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రిడేటర్ డ్రోన్లను తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తల నేపథ్యంలో రక్షణశాఖ అత్యవసర కొనుగోళ్లకు అనుమతులివ్వడం వల్ల ఈ డ్రోన్లను తీసుకుంది భారత నావికాదళం.
ఈ నెల మొదటి వారంలో ఈ డ్రోన్లు తమకు అందాయని.. ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయని నౌకాదళం వెల్లడించింది. 30 గంటల పాటు నిర్విరామంగా ప్రయాణించగలిగే సామర్థ్యం ఈ డ్రోన్ల సొంతమని, ఇది నౌకాదళానికి పెద్ద ఆస్తి అని అధికారులు వెల్లడించారు.
ఈ రెండు డ్రోన్లను ఏడాది పాటు లీజుకు తీసుకున్నట్టు సమాచారం. అయితే ఇలాంటి మరో 18 డ్రోన్లను పొందేందుకు త్రివిధ దళాలు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చూడండి:-ట్రాన్స్ జెండర్లకు త్వరలో ప్రత్యేక హెల్ప్‌లైన్!