తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బరువు తగ్గించినందుకు 8 వారాల జైలు - సింగపూర్​

నిజం ఎప్పటికైనా బయటపడాల్సిందే. తప్పు చేసి ఎన్ని రోజులు తప్పించుకున్నా... ఏదో రూపంలో మనల్ని వెంటాడుతుంది. ఇదే పరిస్థితి సింగపూర్​లో ఓ భారతీయుడికి ఎదురైంది. రెండేళ్లుగా అవినీతికి పాల్పడుతూ అనుకోని పరిస్థితిలో బుక్కయ్యాడు.

ఛాంఘీ విమానాశ్రయం

By

Published : Apr 30, 2019, 2:32 PM IST

విమాన ప్రయాణికులను వేధించే సమస్య... లగేజీ. మన బ్యాగుల బరువు విమానయాన సంస్థలు నిర్దేశించిన పరిమితిలోపే ఉండేలా చూసుకోవడం పెద్ద సవాలే. పరిమితి కాస్త దాటినా... అదనంగా భారీ రుసుము చెల్లించాల్సిందే. ఈ ఇబ్బందినే అక్రమార్జనకు మార్గంగా ఎంచుకున్నాడో ప్రబుద్ధుడు. చివరకు కటకటాలపాలయ్యాడు.

ఇదీ కథ

సింగపూర్ ఛాంఘీ​ విమానాశ్రయంలో వినియోగదారుల సేవల విభాగంలో పని చేస్తున్నాడు హితేశ్ కుమార్ పటేల్. టైగర్​ ఎయిర్​వేస్​ ప్రయాణికుల లగేజీ నిర్ణీత బరువుకు లోబడి ఉందా లేదా అని పరీక్షించటం ఆయన విధి. ప్రయాణికుల అవసరాలను ఆసరాగా తీసుకున్న పటేల్​.. అధిక బరువును తక్కువగా చూపి లంచాలు తీసుకోవటం మొదలు పెట్టాడు.

లగేజీ అక్రమాల్లో భాగంగా గోపాల్​ కృష్ణ రాజుతో హితేశ్​కు పరిచయమైంది. సింగపూర్​లో బంగారం కొని, చెన్నైలో అమ్మడం రాజు ప్రవృత్తి. ఇందుకోసం చెన్నై వెళ్లేవారి సాయం తీసుకునేవాడు రాజు. వారి లగేజీలోనే బంగారం పంపేవాడు. ఇందుకు వారికి కొంత సొమ్ము ఇచ్చేవాడు.

లగేజీ బరువు తక్కువగా చూపేందుకు హితేశ్​కు లంచాలు ఇచ్చేవాడు రాజు. అప్పుడప్పుడూ డబ్బుతో పాటు భోజనమూ పెట్టించేవాడు. 2016 జనవరి-అక్టోబర్​ మధ్య వీరి బంధం రోజుకో లగేజీ- రెండు లంచాలు- మూడు భోజనాలు అన్నట్లు సాగింది.

వార్తతో తారుమారు

సింగపూర్​ విమానాశ్రయంలో లగేజీ విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని గతేడాది జులై 13న ఓ పత్రిక కథనం ప్రచురించింది. విమానాశ్రయం అధికార యంత్రాంగం అంతర్గత విచారణ జరిపించింది. హితేశ్​ బాగోతం గుర్తించింది.

సీన్​ కట్​చేస్తే... లంచం తీసుకున్న నేరానికి హితేశ్​కు 8 వారాల జైలు శిక్ష, 800 సింగపూర్​ డాలర్ల జరిమానా విధించింది కోర్టు.

పటేల్​ తరహాలోనే బుక్కయిన మరో ఇద్దరు భారతీయులకూ గత వారమే శిక్ష వేసింది సింగపూర్​ కోర్టు.

ఇదీ చూడండి: చీమల పార్సిల్​ సీజ్​ చేసిన కస్టమ్స్ అధికారులు!

ABOUT THE AUTHOR

...view details