తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​-చైనా రాజీ బాట... బలగాల ఉపసంహరణకు సై! - india china talks latest news

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్, చైనా ముందడుగు వేశాయి. సోమవారం జరిగిన సైనిక ఉన్నతాధికారుల భేటీలో బలగాల ఉపసంహరణకు అంగీకరించినట్లు తెలుస్తోంది. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.

Indian, Chinese militaries
భారత్ చైనా సైనికాధికారుల భేటీ

By

Published : Jun 23, 2020, 3:47 PM IST

భారత్-చైనా మధ్య సైనిక చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. తూర్పు లద్దాఖ్​​లో ఉద్రిక్తతలు తగ్గించేలా సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణకు ఇరు దేశాలు అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.

భారత్, చైనా లెఫ్టినెంట్​ జనరళ్ల మధ్య మోల్డోలో సోమవారం జరిగిన సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు సైనిక వర్గాల సమాచారం. దాదాపు 11 గంటలపాటు జరిగిన ఈ భేటీలో భారత్​ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా తరఫున టిబెట్​ మిలిటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ మేజర్ జనరల్​ లియూ లిన్​ పాల్గొన్నారు.

"ఇరుదేశాల ఉన్నత సైనికాధికారుల మధ్య స్నేహపూర్వక, సానుకూల, నిర్మాణాత్మక వాతావరణంలో చర్చలు జరిగాయి. ఇద్దరు సైనికాధికారులు పరస్పర అంగీకారానికి వచ్చారు. తూర్పు లద్దాఖ్​లోని అన్ని ప్రాంతాల నుంచి వెనక్కు తగ్గాలని రెండు వర్గాలు నిర్ణయించాయి."

- సైనిక వర్గాలు

ఉద్దేశపూర్వకంగానే..

గల్వాన్ లోయ హింసాత్మక ఘర్షణలతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఈ దాడిని చైనా బలగాలు ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసినట్లు భారత్ ఆరోపిస్తోంది. ఇదే విషయాన్ని భేటీలో భారత్​ బృందం ప్రధానంగా ప్రస్తావించింది.

ఈ నేపథ్యంలోనే తూర్పు లద్దాఖ్​లోని అన్ని ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని చైనా బృందాన్ని డిమాండ్ చేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా సరిహద్దు స్థావరాల వెనుక మోహరించిన బలగాలనూ తగ్గించాల్సిందేనని తేల్చిచెప్పిందని తెలిసింది.

చైనా ప్రకటన

ఉన్నత సైనికాధికారుల భేటీలో సరిహద్దుల్లో శాంతి నెలకొనేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు చైనా విదేశాంగ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్​ వెల్లడించారు. అయితే వాటికి సంబంధించిన సమాచారం తన వద్ద లేదని తెలిపారు. దౌత్య, సైనిక చర్చల మార్గంలోనే వివాద పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

గల్వాన్ ఘర్షణల్లో చైనా వైపు 40 మందికిపైగా మృతి చెందారన్న వార్తల్లో నిజం లేదని లిజియాన్ పేర్కొన్నారు. ఘర్షణలో మృతుల సంఖ్యకు సంబంధించి చైనా స్పందించటం ఇదే తొలిసారి.

నాలుగు ప్రాంతాల్లో..

భారత్​-చైనా మధ్య తాజా సరిహద్దు ఉద్రిక్తతలు మే నెల మొదటివారం నుంచి ప్రారంభమయ్యాయి. తూర్పు లద్దాఖ్​, సిక్కింలోని నాలుగు ప్రాంతాల్లోని సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు బాహాబాహీకి దిగారు. ఈ నేపథ్యంలో చైనాకు దీటుగా బలగాలను తరలించింది భారత్. భారీ సంఖ్యలో వాయుసేనను కూడా మోహరించింది.

అప్పటి నుంచి వాస్తవాధీన రేఖ వెంబడి యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో జూన్​ 6న ఇరు దేశాల లెఫ్టినెంట్ జనరల్​ స్థాయి చర్చలు జరిగాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను ఉపసంహరించుకోవాలని ఇరువర్గాలు నిర్ణయించాయి.

చైనా ఉల్లంఘనతో..

గల్వాన్​లో జూన్ 15న చైనా ఉల్లంఘనకు పాల్పడిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో భారత్​కు చెందిన 20 మంది సైనికులు అమరులయ్యారు. చైనా వైపున 40 మందికి మరణించినట్లు వార్తలు వచ్చిన.. 20 మందిలోపే చనిపోయారని తాజాగా వెల్లడించింది ఆ దేశం.

చైనా ఈ ఘర్షణలను ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు భారత్ నమ్ముతోంది. అమెరికాకు భారత్ దగ్గరవుతుండటం, కరోనాతో ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయతను కోల్పోయిన నేపథ్యంలో తన బలం ప్రదర్శించేందుకు చైనా ప్రయత్నిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.

ఇదీ చూడండి:ఓవైపు చైనా.. మరోవైపు నేపాల్​... ఎందుకిలా?

ABOUT THE AUTHOR

...view details