భవిష్యత్తులో రాబోయే యుద్ధాలలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలతో భారత్ పోరాడుతుందన్నారు సైన్యాధ్యక్షుడు జనరల్ బిపిన్ రావత్. డీఆర్డీఓ డైరెక్టర్ల 41వ సమావేశంలో ఆయన ప్రసంగించారు.
భవిష్యత్తులో ప్రత్యక్ష యుద్ధాలు చేసే పరిస్థితులు ఉండవన్నారు రావత్. పరోక్ష యుద్ధాల కోసం నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని డీఆర్డీఓకు సూచించారు. సైబర్ స్పేస్, లేజర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వంటి సాంకేతికతలను అభివృద్ధి చేయాలన్నారు. రోబోలను ప్రవేశపెట్టడం సహా కృత్రిమ మేధను వినియోగించాలన్నారు.
ఇప్పటికైనా ఆ దిశగా ఆలోచించాలని లేకపోతే చాలా ఆలస్యం జరిగినట్లేనన్నారు బిపిన్. కొన్ని దశాబ్దాలుగా డీఆర్డీఓ అద్భుత విజయాలు సాధిస్తోందని కొనియాడారు.
"స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు గడుస్తున్నా ఆయుధాల దిగుమతిలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది భారత్. ఇది గర్వంగా చెప్పుకునే విషయం కాదు. కానీ కొన్నేళ్లుగా మార్పులు కనిపిస్తున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో సైన్యానికి కావాల్సిన అవసరాలు తీర్చడానికి డీఆర్డీఓ తీవ్రంగా కృషి చేస్తోంది. తర్వాత జరగబోయే యుద్ధంలో స్వదేశీ ఆయుధ సంపత్తితోనే పోరాడి విజయం సాధిస్తామన్న నమ్మకం మాకు ఉంది."-జనరల్ బిపిన్ రావత్, సైన్యాధిపతి.