తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లద్దాఖ్‌లో ఆర్మీ జవాన్ల కోసం 'హీట్‌ టెంట్లు' - భారత్-చైనా ప్రతిష్టంభన

శీతాకాలం దృష్ట్యా... సరిహద్దుల్లో బలగాలకు వసతి సౌకర్యాలను పెంచింది భారత సైన్యం. తూర్పు లద్దాఖ్​ ఫ్రంట్‌లైన్‌లో విధులు నిర్వహించే బలగాల కోసం హీట్‌ టెంట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

Ladakh_Heat tents
లద్దాఖ్‌లో ఆర్మీ జవాన్ల కోసం 'హీట్‌ టెంట్లు'

By

Published : Nov 18, 2020, 7:03 PM IST

ఆర్మీ జవాన్ల కోసం ఏర్పాటు చేసిన హీట్​ టెంట్లు

తూర్పు లద్దాఖ్‌లో అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్న దేశ జవాన్లకు వసతి సదుపాయాలను మెరుగుపరిచింది భారత సైన్యం. జవాన్ల కోసం బెడ్లు, ప్రత్యేక కబోర్డులతో పాటు గదుల్లో విద్యుత్‌, నీటి సరఫరా, హీటర్లు వంటి సదుపాయాలను ఏర్పాటు చేసింది. ఆయుధాలు, ఇతర సైనిక సామగ్రిపై మంచు కప్పకుండా ఉండేందుకు ప్రత్యేక షెల్టర్లను నిర్మించింది.

క్లిష్ట పరిస్థితుల్లో పెను సవాలే...

సముద్రమట్టానికి 17వేల అడుగుల ఎత్తులో ఉన్న లద్దాఖ్‌లో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు సున్నా కంటే తక్కువకు పడిపోతాయి. నవంబరులో ఈ ప్రాంతంలో మైనస్‌ 30 నుంచి మైనస్‌ 40 డిగ్రీస్‌ వరకు ఉష్ణోగ్రత తగ్గుతుంది. బలమైన చలిగాలులు వీస్తుంటాయి. ఒక్కోసారి 40 అడుగుల మేర మంచు పేరుకుపోయి ఉంటుంది. ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో భారత జవాన్లు ఇక్కడ దేశ రక్షణ కోసం పహారా కాయడం పెను సవాలే. అలాంటి జవాన్ల కోసం వసతిని మెరుగుపరిచింది భారత సైన్యం.

'శీతాకాలంలో బలగాల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచేందుకు లద్దాఖ్‌ సెక్టార్‌లోని జవాన్లందరికీ వసతి సదుపాయాలను మెరుగుపర్చాం' అని భారత సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ఫ్రంట్‌లైన్‌లో విధులు నిర్వహించే బలగాల కోసం హీట్‌ టెంట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

ప్రతిష్టంభన కారణంగా...!

ఇటీవలే భారత్‌-చైనా మధ్య సరిహద్దు వివాదంతో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో లద్ధాఖ్‌లో జవాన్లకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది మే నుంచి చైనా కవ్వింపు చర్యలతో నియంత్రణ రేఖ వద్ద ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో లద్దాఖ్‌లో మరింతకాలం భారత బలగాల మోహరింపు కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఇదీ చదవండి:'ఐరోపా​, అమెరికాలతో పోలిస్తే భారత్​లో తక్కువే'

ABOUT THE AUTHOR

...view details