ప్రవాస భారతీయ ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీని ఈ ఏడాది ప్రఖ్యాత నోబెల్ పురస్కారం వరించింది. ఆర్థిక శాస్త్రం విభాగంలో ఆయన భార్య ఎస్తర్ డఫ్లో, మైఖేల్ క్రమెర్తో కలిసి ఈ అవార్డును అందుకోనున్నారు అభిజిత్. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించేందుకు చేసిన పరిశోధనలు, ప్రతిపాదనలకు గానూ వీరికి ఈ పురస్కారాన్ని ప్రకటించింది నోబెల్ కమిటీ.
ముంబయి నుంచి అమెరికాకు..
58 ఏళ్ల అభిజిత్ బెనర్జీ మహారాష్ట్ర రాజధాని ముంబయిలో జన్మించారు. దిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు. కలకత్తా విశ్వవిద్యాలయంలోనూ ఆయన చదివారు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లి హార్వర్డ్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు.
ప్రస్తుతం ఆయన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ఫోర్డ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. మరెన్నో ఆర్థిక రంగ సంస్థలకు డైరెక్టర్గా వ్యవహరించారు. 2015లో ఐరాస అభివృద్ధి మండలి ఉన్నతస్థాయి సంఘంలో సభ్యులుగా సేవలందించారు.
భార్యతో కలిసి..
తన సహ పరిశోధకురాలు, ఫ్రాన్స్ జాతీయురాలు ఎస్తర్ డఫ్లోతో చాలా కాలం పాటు ప్రేమలో ఉన్నారు అభిజిత్ బెనర్జీ. 2015లో ఆమెను వివాహం చేసుకున్నారు. ఎస్తర్ కూడా ఎంఐటీలో పేదరిక నిర్మూలన, ఆర్థిక రంగ అభివృద్ధిపై ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఎస్తర్‌తో కలిసి 2003లో 'అబ్దుల్ లతిఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్'ను స్థాపించారు.
రచనలు..
ఆర్థిక శాస్త్రంలో అభిజిత్ రచనలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. నాలుగు పుస్తకాలను రచించారు. ఆయన రాసిన 'పూర్ ఎకనామిక్స్' 17 భాషల్లోకి అనువాదమయింది. 2011లో 'గోల్డ్మన్ సాక్స్ బిజినెస్ బుక్ ఆఫ్ ద ఇయర్' పురస్కారం దక్కింది. మరో మూడు రచనలకు సంపాదకీయులుగా వ్యవహరించారు. రెండు డాక్యుమెంటరీ చిత్రాలను తీశారు.
న్యాయ్‌పై స్పందన
అమెరికాలో స్థిరపడినప్పటికీ భారత్‌లోని కేంద్ర ప్రభుత్వ పథకాలపై అభిజిత్ పలు సందర్భాల్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రకటించిన న్యాయ్‌పై అభిజిత్ స్పందించారు. నిధుల సమీకరణ కోసం పన్నుల సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చూడండి: ప్రవాస భారతీయ దంపతులకు 'నోబెల్'