భారత్, చైనా మధ్య శనివారం జరగనున్న లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చల్లో సరిహద్దు సమస్యల పైనే ప్రధానంగా చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. పాంగోంగ్ సో, గాల్వన్ లోయ, దెమ్‌చొక్ ప్రాంతాల్లో ఘర్షణలకు సంబంధించిన చర్చలపై ప్రతిపాదన తీసుకురానున్నట్లు వెల్లడించారు. సరిహద్దులో యథాతథ స్థితిని నెలకొల్పే విషయంపై భారత్ పట్టుబట్టే అవకాశం ఉందన్నారు.
లేహ్‌లోని 14వ కార్ప్స్ కమాండింగ్ అధికారి.. లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ భారత్ తరఫున ఈ భేటీకి హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. చైనా సైతం ఆమోదయోగ్యమైన ప్రతిపాదనలతో ముందుకొస్తుందనే ఆశిస్తున్నట్లు సీనియర్ మిలిటరి అధికారి ఒకరు ఆశాభావం వ్యక్తం చేశారు.