దేశరాజధాని దిల్లీలో 74వ స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఎర్రకోట ప్రాంగణం ఇప్పటికే త్రివర్ణశోభితమైంది. దేశంలో కరోనా ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకొని కొవిడ్ నిబంధనలను పాటిస్తూ కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. భౌతిక దూరం, శుభ్రతకు ప్రాధాన్యమిస్తూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది రక్షణ శాఖ.
ప్రత్యేక ఏర్పాట్లు..
ప్రధాని నరేంద్ర మోదీ మువ్వన్నెల జెండాను ఎగురవేసిన తర్వాత ప్రసంగించేందుకు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ క్లోజర్ ఏర్పాటు చేసింది. అతిథుల కూర్చుకునేందుకు కుర్చీలు, వాటికి ఎన్క్లోజర్లు సిద్ధం చేశారు. నడిచే దారుల్లో కార్పెట్లు, ఉడెన్ ఫ్లోరింగ్ అందుబాటులోకి తెచ్చారు. ఇద్దరు అతిథుల మధ్య 6 మీటర్ల దూరం ఉండేలా చర్యలు తీసుకున్నారు.
తనిఖీల కోసం అదనంగా డోర్ ఫ్రేమ్ మెటల్ డికెక్టర్లు సిద్ధంగా ఉంచారు. ఆహ్వానితులు వరుసల్లో నిలబడకుండా త్వరగా లోనికి వెళ్లేలా మార్కింగ్స్‌ను ఏర్పాటు చేశారు. వాహనాలు రద్దీని తగ్గించేందుకు ఇటుకలతో రెండు మూడు వరుసల్లో మార్గాలను సిద్ధం చేశారు.
అతిథుల జాబితా కుదింపు...
కరోనా నేపథ్యంలో స్వాతంత్య్ర వేడుకల అతిథుల జాబితాను 150కి కుదించినట్లు తెలుస్తోంది. ప్రధానికి ఏటా వేల మంది త్రివిధ దళాల సభ్యులు గౌరవ వందనం సమర్పిస్తారు. కానీ కరోనా నేపథ్యంలో ఈసారి 22 మంది మాత్రమే ప్రధానికి గౌరవ వందనం చేయనున్నారు. పరేడ్‌లోనూ ఈసారి కేవలం 350 మంది దిల్లీ పోలీసులు పాల్గొనబోతున్నారు.
ఈ పరేడ్‌లో పాల్గొనే వారందరినీ 14 రోజుల ముందు నుంచే క్వారంటైన్ చేసినట్లు సమాచారం. ఎర్రకోటలో ఏర్పాట్లన్నీ పూర్తి కాగా.. గురువారం తెల్లవారుజామున చిరుజల్లుల మధ్యలోనే త్రివిధ దళాలు ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించాయి.
ఎర్రకోట వద్ద డ్రెస్ రిహార్సల్స్ 4 వేల మంది..
ప్రధాని మోదీ సహా కొద్దిమంది వీవీఐపీలు, త్రివిధ దళాల సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లు, కరోనా యోధులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఏటా 30 వేల మందికిపైగా హాజరయ్యే ఎర్రకోటలో ఈసారి 4 వేల మందితోనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఏటా వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొనేందుకు అవకాశం ఉండేది. కరోనా కారణంగా పాఠశాల విద్యార్థులు హాజరుకావొద్దని అధికారులు ఆదేశించారు. వీరికి బదులుగా ఎన్సీసీ కాడెట్లను ఆహ్వానించారు. వీరు జ్ఞాన్‌పథ్‌లో కూర్చుంటారు.
కరోనా నిబంధనలు..
పారిశుద్ధ్యం, శానిటైజర్లతో పాటు మాస్కులు ధరించాలంటూ బోర్డులను ఏర్పాటు చేశారు. మాస్కుల ధరిస్తేనే లోపలికి అనుమతించడం సహా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఎర్రకోటలోని నాలుగు ప్రాంతాల్లో వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. అతిథుల్లో ఎవరికైనా కొవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే గుర్తించేలా చర్యలు తీసుకున్నారు. ఈ నాలుగు ప్రాంతాల్లో ఆంబులెన్సులను కూడా అందుబాటులో ఉంచారు. అన్ని ప్రవేశ మార్గాల్లో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు.
మోదీ షెడ్యూలు ఇలా..
- ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం 7.06 గంటలకు రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులు అర్పిస్తారు.
- అనంతరం ఉదయం 7.18 గంటలకు ఎర్రకోట చేరుకుని భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరిస్తారు.
- ఉదయం 7.30 గంటలకు జెండా ఎగురవేస్తారు.
- జెండావిష్కరణ తర్వాత ఎర్రకోట నుంచి జాతీనుద్దేశించి ప్రసంగిస్తారు.
కరోనా ఉద్ధృతి, సవాళ్లు, ఆత్మనిర్భర్ భారత్ సహా మరిన్ని అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రధాని ప్రసంగంలో భవిష్యత్‌పై ఎలాంటి భరోసా ఉంటుందోనని యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఇదీ చూడండి:మోదీ రికార్డు: సుదీర్ఘ కాలం ప్రభుత్వ అధినేతగా