" బాలాకోట్‌లో ఉగ్రస్థావరాలపై వాయుసేన దాడి ప్రాక్టీస్ వంటిది. అసలైన చర్యలు ముందుంటాయి".... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్ష వ్యాఖ్యలివి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేవరకు వెనక్కి తగ్గేదే లేదని ఈ వ్యాఖ్యలతో కరాఖండిగా చెప్పేశారు మోదీ.
ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ పెంచి పోషిస్తోందనేది జగమెరిగిన సత్యం. ఉగ్రమూకలకు పాక్ సైన్యం ఎన్నోసార్లు సాయం చేసింది. భారత్‌పై దాడులకు ఉసిగొల్పింది. ఇందుకు భారత్ వద్ద సాక్ష్యాలు ఉన్నాయి. గతంలో చాలా సార్లు వాటిని బహిర్గతం చేసింది. ముంబయి పేలుళ్ల నుంచి పఠాన్‌కోట్ వరకు జరిగిన అన్ని ఉగ్రదాడులపై ఆధారాలను పాక్‌కు సమర్పించింది. అయినా ఉగ్రవాదులపై పాక్ ఏ చర్యలు తీసుకోలేదు. పైగా వారు మా దేశంలో లేరు, ఆచూకీ తెలియదు అంటూ బుకాయిస్తూ వచ్చింది.
ఉగ్రదాడుల వెనుక అతడు
పుల్వామానే కాకుండా గతంలో భారత్‌పై జరిగిన చాలా ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారి జైషే మహ్మద్ ఉగ్రసంస్థ అధిపతి మసూద్ అజర్. అతడు పాకిస్థాన్‌లోనే ఉన్నాడు. పాక్ ప్రభుత్వమే అతడికి రక్షణ కల్పిస్తోంది. అయినా అజార్ ఎక్కడున్నాడో తెలియడం లేదంటూ అసత్యాలు చెబుతోంది. ఉగ్రవాదాన్ని వెనకేసుకొస్తోంది.
పాక్ తీరుతో భారత్ సహనం నశించింది. పుల్వామా దాడి తర్వాత ఉగ్రవాదంపై పోరు ప్రకటించింది. ముష్కరులను ప్రోత్సహిస్తున్న పాక్ బండారాన్ని బయటపెట్టి... అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టాలనే సంకల్పంతో ఉంది. ఇది అర్థం చేసుకున్న పాక్... ఇప్పుడు ఏదో ఒక మార్గంలో బయటపడాలని చూస్తోంది.
చర్చల ప్రతిపాదన నాటకమే!
దౌత్యపరంగా భారత్ ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరైన ప్రతిసారి శాంతి, చర్చలు అనే మాటలను వల్లెవేయడం పాకిస్థాన్‌కు అలవాటు. ఈసారీ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అలాంటి వ్యూహమే అనుసరిస్తున్నారు. అసలు పాకిస్థాన్ చర్చల ప్రతిపాదనంతా నాటకమే. ప్రపంచం ముందు శాంతిని కోరుతున్నామనే డాబుల కోసం అలా చేస్తోంది. చర్చల విషయంలో భారత్ ఎప్పుడో వైఖరి స్పష్టం చేసింది. కశ్మీర్ అంశానికి తావు లేకుండా చర్చలు జరగాలన్నది దిల్లీ వాదన. కశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చినందుకు చాలాసార్లు చర్చలు రద్దయ్యాయి. ఈ విషయం ఇమ్రాన్‌కూ తెలుసు. అయినా మళ్లీ అదే పాట పాడారు. గురువారం కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. చర్చిద్దాం రండి అంటూ పిలుపునిచ్చారు.
చర్చలు.. శాంతి.. సుహృద్భావం అంటూనే... ఉగ్రవాదానికి ఊతమిస్తారు పాక్ నేతలు.ఇది గతంలో అనేకసార్లు రుజువైంది. అందుకే ఇమ్రాన్ మాటలను భారత్ నమ్మే ప్రసక్తే లేదని తేలిపోయింది. ఐఏఎఫ్ పైలట్ విడుదలను స్వాగతించినా... పాక్‌పై చర్యలు తీసుకోవాలనే భావిస్తోంది. చర్చల పేరుతో నాటకమాడుతున్న పాక్‌ను ఉపేక్షించడం మంచిది కాదని నిశ్చయించుకుంది. ప్రధాని మోదీ, త్రివిధ దళాధిపతులు మాటలు వింటే అది స్పష్టమైపోతోంది.