గల్వాన్ లోయలో చైనా దొంగదెబ్బ తీసి కర్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లను బలితీసుకున్న తర్వాత వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఓ వైపు సైనికాధికారుల స్థాయి చర్చలు జరుపుతూనే మరోవైపు పెద్దఎత్తున బలగాలను మోహరిస్తూ చైనా దుర్నీతిని ప్రదర్శిస్తూనే ఉంది.
ఇప్పటికే యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లతో వాస్తవాధీన రేఖ వద్ద చైనా అలజడి సృష్టిస్తోంది. భారత్ సైతం అందుకు దీటుగా స్పందిస్తోంది. ఇప్పటికే భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చక్కర్లు కొడుతూ.. శత్రుదేశం కదలికలను గమనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా తక్షణం స్పందించేందుకు అధునాతన క్షిపణులను కూడా ఎల్ఏసీ వద్ద భారత్ మోహరించింది.
లద్దాఖ్ వద్ద సర్వం సిద్ధం
భూఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణి రక్షణ వ్యవస్థలను తూర్పు లద్దాఖ్ సెక్టార్‌కు తరలించింది. చైనా ఆర్మీతోపాటు, ఫైటర్ జెట్ల ద్వారా వైమానిక దళం ఏదైనా దాడికి పాల్పడితే దీటుగా బదులిచ్చేందుకు భారత సైన్యంతో పాటు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రక్షణ వ్యవస్థలను తూర్పు లద్దాఖ్ వద్ద సిద్ధంగా ఉంచినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.