తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఓ కూలీ కథ: 135 కి.మీ. నడక- నీళ్లే ఆహారం - lockdown news

దేశంలో లాక్​డౌన్​ కారణంగా వలసకూలీలు ఇబ్బందులు పడుతున్నారు. మహారాష్ట్రకు చెందిన ఓ వలస కూలీ రెండురోజుల పాటు ఆహారం ముట్టకుండా.. మంచినీరు తాగి ఏకంగా 135 కిలోమీటర్లు ప్రయాణించి సొంత గ్రామానికి చేరుకున్న ఘటన కలచివేస్తోంది.

COOLIE STORY
ఓ కూలీ కథ: 135 కి.మీ. నడక- నీళ్లే ఆహారం

By

Published : Mar 27, 2020, 6:15 AM IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం ప్రకటించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొంత ఊళ్లు వెళ్లేందుకు రవాణా సదుపాయం లేక.. కాలినడకన ఇంటికి చేరుకుంటున్న ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.

మహారాష్ట్రలోని చంద్రపుర్‌ జిల్లా జాంబ్‌ గ్రామానికి చెందిన నరేంద్ర షెల్కే పుణెలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. ఇటీవల ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. పుణె నుంచి నాగ్‌పుర్‌ వరకు రైల్లో చేరుకున్నాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్దామంటే అప్పటికే ఇతర రవాణా సదుపాయాలు ప్రభుత్వం నిలిపివేయడం వల్ల కాలికి పనిచెప్పక తప్పలేదు.

135 కిలోమీటర్లు..

మంగళవారం తన నడకను ఆరంభించాడు. దారిలో ఎలాంటి ఆహారం తినకుండా కేవలం దాహం తీర్చుకుంటూ సొంత గ్రామానికి పయనమయ్యాడు. సొంతింటికి వెళ్లాలన్న అతడి కల అంత సులువుగా నెరవేరలేదు. బుధవారం రాత్రి పెట్రోలింగ్‌ పోలీసులు అతడిని దారిలో ఆపారు. అప్పటికే అతడి నడక 135 కిలోమీటర్లు సాగింది.

వైద్యుల అనుమతితో..

కర్ఫ్యూను ఎందుకు ఉల్లంఘించావంటూ ప్రశ్నించడంతో తన గోడు వెళ్లబోసుకున్నాడు. అతడిని స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎస్సై మానవతా దృక్పథంతో స్పందించి ఇంటి నుంచి భోజనం తెప్పించి పెట్టాడు. వైద్యుల అనుమతితో సొంత గ్రామానికి ఓ వాహనాన్ని ఏర్పాటు చేశారు.

అక్కడి నుంచి 25 కిలోమీటర్లు ప్రయాణించి ఇంటికి చేరుకున్నాడు. అయితే, అతడిని 14 రోజుల పాటు ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి:లాక్​డౌన్​ వేళ దిల్లీ పోలీసుల మానవత్వం

ABOUT THE AUTHOR

...view details