కరోనా వైరస్ వల్ల అన్ని వ్యవస్థల రూపురేఖలు మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా రంగంలోనూ భారీ సంస్కరణలు చేపట్టడానికి ప్రణాళికలు రచిస్తోంది కేంద్రం. "పీఎం ఈ-విద్య" పేరుతో డిజిటల్, ఆన్లైన్ కోర్సులను అతి త్వరలోనే దేశవ్యాప్తంగా ఆవిష్కరించనుంది. దేశంలోని టాప్-100 విశ్వవిద్యాలయాలు.. ఈ నెల 30లోగా ఈ ఆన్లైన్ కోర్సులను ప్రారంభించడానికి అనుమతినిచ్చింది కేంద్రం.
ఆత్మ నిర్భర భారత్ పథకంలో భాగంగా విద్యా రంగంలో చేపట్టనున్న సంస్కరణల వివరాల్ని ఈమేరకు వెల్లడించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
పీఎం ఈ-విద్య ఫీచర్స్...
- రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థుల కోసం "దీక్ష". ఇందులో క్యూఆర్ కోడ్ ఆధారంగా అన్ని తరగతుల వారికి పాఠ్య పుస్తకాలుంటాయి.
- 1 నుంచి 12 తరగతుల వారి కోసం ఓ ప్రత్యేక టీవీ ఛానల్
- విద్యా బోధన కోసం రేడియో, పాడ్క్యాస్ట్ల సేవలను విస్త్రత వినియోగం.
- దివ్యాంగుల, చూపు లేనివారు, వినలేని వారి కోసం ప్రత్యేక కోర్సులు.
- విద్యార్థుల, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యానికి మద్దతివ్వడానికి "మనోదర్పణ్".
- ఈ దశాబ్దపు నైపుణ్య అవసరాలతో కూడిన నూతన జాతీయ పాఠ్యాంశాలు.
- 2025లోపు ఐదవ తరగతిలోగా చదువులో బాగా రాణించడానికి నేషనల్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ మిషన్. ఇది ఈ ఏడాది డిసెంబర్లో ప్రారభం.
ఇప్పటివరకు...
కోరనా సంక్షోభం ఉన్నా విద్యా బోధనకు ఆటంకం కలగకుండా ఇప్పటికే అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపింది కేంద్రం. ఇంటర్నెట్ లేని ప్రాంతాల్లోనూ "స్వయం ప్రభ డీటీహెచ్" ఛానెల్ నడుపుతున్నట్లు గుర్తు చేసింది. "దీక్ష"ను మార్చి 24 నుంచి 61 కోట్ల మంది వీక్షించారని వెల్లడించింది.