తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సొమ్ము పంపే ప్రవాసీల్లో మళ్లీ మనోళ్లే టాప్! - USD

ప్రవాసులు స్వదేశాలకు పంపే సొమ్ము విలువ రికార్డు స్థాయికి చేరింది. భారతదేశం ఎప్పటిలానే మళ్లీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.

సొమ్ము పంపే ప్రవాసీల్లో మళ్లీ మనోళ్లే టాప్!

By

Published : Apr 9, 2019, 3:22 PM IST

ప్రవాసులు.. స్వదేశాలకు పంపే సొమ్ము విలువ గరిష్ఠ స్థాయిని తాకింది. సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇందులో ఎప్పటి నుంచో మొదటిస్థానంలో ఉన్న భారత్... 2018లోనూ దాదాపు రూ. 5.5 లక్షల కోట్ల(19 బిలియన్​ డాలర్లు)తో మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు తన నివేదికలో వెల్లడించింది.

రూ. 4.66 లక్షల కోట్లతో చైనా రెండో స్థానంలో ఉండగా.... మెక్సికో, ఫిలిప్పీన్స్​, ఈజిప్టులు తదుపరి స్థానాలు దక్కించుకున్నాయి.

2016లో రూ. 4.36 లక్షల కోట్లు(62.7 బి.డా.), 2017లో రూ. 4.54 లక్షల కోట్లు(65.3 బి.డా.) భారతదేశానికి చేరాయి.

కేరళ వరదలు కీలకమే..

క్రితం ఏడాదిలో పోల్చితే 2018లో ప్రవాసుల నుంచి అందిన సొమ్ము 14 శాతం పెరిగింది. కేరళ వరదలు సంభవించిన సమయంలో ప్రవాసుల నుంచి సొంత కుటుంబాలకు అందిన సహాయం కూడా ఈ వృద్ధికి కారణమని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

పాకిస్థాన్​లో అంతంతమాత్రమే...

పాకిస్థాన్​కు విదేశాల నుంచి అందుతున్న ఈ తరహా సొమ్ములో 7 శాతం వృద్ధి మాత్రమే కనిపించింది. సాధారణంగా ఈ దేశానికి ఎక్కువ సొమ్ము అందించే సౌదీ అరేబియా నుంచి నిధుల ప్రవాహం తగ్గటమే దీనికి కారణం. బంగ్లాదేశ్​ విషయంలో మాత్రం ఈ నిధుల రాక 15 శాతం పెరిగింది.

దక్షిణాసియాకు సంబంధించి ఈ సొమ్ము విషయంలో 12 శాతం వృద్ధి నమోదై 131 బిలియన్​ డాలర్లకు చేరింది. 2017లో ఈ వృద్ధి శాతం 6గానే ఉండటం గమనార్హం.

అల్పాదాయ దేశాలకు పెరిగిన ప్రవాహం..

ఈ నివేదిక ప్రకారం అల్ప, మధ్య స్థాయి ఆదాయ దేశాలకు విదేశీ సొమ్ము ప్రవాహం రికార్డు గరిష్ఠాన్ని తాకింది. 2018లో 9.6 శాతం పెరిగి 529 బిలియన్​ డాలర్లకు చేరింది. ఇది 2017లో 483 బిలియన్​ డాలర్లుగా ఉంది.

అధికాదాయ దేశాలు 689 బిలియన్​ డాలర్లు పొందాయి. ఇది 2017లో 633 బిలియన్​ డాలర్లుగా ఉంది.

గల్ఫ్​ దేశాల నుంచి పెరుగుదల...

ముడిచమురు ధరలు పెరగటం వల్ల గల్ఫ్​ సహకార మండలి(జీసీసీ) దేశాల సొమ్ము ప్రవాహంపై సానుకూల ప్రభావం పడింది. అమెరికాలో ఆర్థిక పరిస్థితి మెరుగు పడటం కూడా దీనికి తోడవటంతో విదేశీ సొమ్ము ప్రవాహం పెరిగింది.

బహ్రెయిన్​, కువైట్​, ఒమన్​, ఖతార్​, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలు జీసీసీలో సభ్య దేశాలుగా ఉన్నాయి.

పంపించడమే ప్రయాస...

2019 మొదటి త్రైమాసికంలో విదేశాల నుంచి సొమ్మును పంపించడానికి సరాసరిగా 7 శాతం (దాదాపు 14వేల డాలర్లు) ఖర్చు అయింది. ఇది ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. ఐరాస సుస్థిర సాధికారత లక్ష్యాల్లో భాగంగా ఈ ఖర్చును 10.7 డాలర్లకు తగ్గించాల్సి ఉంది.

ఆఫ్రికా దేశాలు, పసిఫిక్​ ద్వీప దేశాల్లో పంపించే సొమ్ములో 10 శాతం చెల్లింపు ఛార్జీలకే పోతోంది.

ఇదీ చూడండి : 'ఎగుమతులపై దృష్టిసారిస్తేనే మరింత వృద్ధి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details