ప్రాచీన కాలం నుంచి ప్రకృతిని కాపాడటమే కాకుండా, దానితో మమేకమై జీవించే సంస్కృతి భారతదేశానికి ఉందని ఐక్యరాజ్య సమితి వేదిగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ పేర్కొన్నారు. ఐరాస నిర్వహించిన జీవవైవిధ్య శిఖరాగ్ర సదస్సులో మాట్లాడారు.
పకృతి వనరుల దోపిడీ, అస్థిరమైన ఆహారపు అలవాట్లు, వినియోగ విధానాలు.. మానవ మనుగడకు ఉపయోగపడే వ్యవస్థను నాశనం చేస్తాయని పేర్కొన్నారు జావడేకర్. ఈ విషయాన్ని కొవిడ్ మహమ్మారి నిరూపించిందన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భారత ప్రగతిని వివరించారు.
"ప్రకృతి రక్షతి రక్షితః అని మా వేదాలు చెబుతాయి. అంటే ప్రకృతిని రక్షిస్తే, ప్రకృతి తిరిగి మనల్ని రక్షిస్తుందని అని అర్థం. గత దశాబ్ద కాలంలో దేశంలో అడవుల శాతాన్ని 24.56 శాతానికి భారత్ పెంచగలిగింది. ప్రపంచంలోని వన్య పులులలో అత్యధికం భారత్లోనే ఉన్నాయి. వీటి సంఖ్య రెట్టింపైంది. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని 2022 గడువుకు ముందే సాధించాం."