పాకిస్థానీ అమ్మాయి చాగన్ కన్వర్‌ని పెళ్లి చేసుకున్నాడు రాజస్థాన్‌కు చెందిన మహేంద్రసింగ్. కానీ ఆమెను అక్కడే వదిలేసి రావాల్సి వచ్చింది. అమ్మాయి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నా సార్వత్రిక ఎన్నికల కారణంగా మంజూరు కాలేదు. పెళ్లై 2 నెలలయినా తన భార్యకు భారత ప్రభుత్వం వీసా మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పాకిస్థాన్‌లో తక్కువ సంఖ్యలో హిందువులు ఉంటారు. అందుకే వారు వధూవరుల కోసం భారత్ వైపు ఎదురు చూస్తారు. మహేంద్రసింగ్-చాగన్ల సంబంధమూ అలా కుదిరిందే. మార్చి 8న జరగాల్సిన వారి పెళ్లి, పుల్వామా ఘటనతో వాయిదా పడింది. దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వల్ల ఇరు కుటుంబాలు పెళ్లిని వాయిదా వేసుకున్నాయి. ఎట్టకేలకు ఏప్రిల్ 16న పాక్ అమర్‌కోట్‌లో ఇరువురికి పెళ్లయ్యింది.
పుల్వామా దాడుల కారణంగా మొదట పెళ్లి వాయిదా పడింది. అంతా సర్దుమణిగాక పెళ్లి చేసుకున్నాం. తర్వాత 2-3 నెలలు అక్కడే ఉన్నాను. పాకిస్థాన్‌లో ఉన్న ఓ హిందూ వంశానికి వరుడు కావాలంటే భారత దేశానికే రావాలి. కానీ, వాళ్లకు వీసా దొరకట్లేదు. _మహేంద్రసింగ్, వరుడు.
పెళ్లికూతురుతోనే భారత దేశంలో అడుగు పెట్టాలనుకున్న అతడు 2 నెలలు అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో రెండు సార్లు అతని వీసాను పొడగించుకున్నాడు. ఎంతకీ భారత ప్రభుత్వం చాగన్కు వీసా మంజూరు చేయకపోవడం వల్ల ఒక్కడే ఇంటికి చేరుకున్నాడు.